Breaking News

యోగాతో ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యం – మంత్రి కొల్లు రవీంద్ర

-యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు..

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలని, సుసంపన్నమైన, ఆనందమయమైన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం-2026 వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర-2026 కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం మంగినపూడి బీచ్‌లో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొని యోగా ఆసనాలు చేశారు. కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని) తదితరులు పాల్గొని యోగా ప్రియులను ఉత్సాహపరిచారు.

బీచ్ ఒడ్డున పచ్చని తివాచీపై యోగ అనే ఆంగ్ల అక్షరాలతో ఏర్పాటు చేసిన అక్షరాకృతులలో కూర్చోబెట్టి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుండి యోగా శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి సూచనలు చేస్తూ ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం వారి చేత యోగాసనాలు వేయించి అందరి చేత యోగ సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. రాగి జావా, తాగునీరు అందించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో యోగాకు విశిష్ట స్థానం ఉందన్నారు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని గుర్తుచేశారు. గత ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారని, విశాఖపట్నం సముద్రతీరంలో ప్రధానమంత్రి సమక్షంలో సుమారు ఐదున్నర లక్షల మందికి పైగా ఒకేసారి యోగాసనాలు చేసి చరిత్ర సృష్టించారని తెలిపారు.

ఈ ఏడాది కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంగినపూడి బీచ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై యోగాలో పాల్గొనడం సంతోషకరమన్నారు. రోజువారీ జీవితంలో ఏకాగ్రత పెరగడం, ఒత్తిడి తగ్గడం, శరీరానికి చురుకుదనం రావడం వంటి అనేక ప్రయోజనాలు యోగా ద్వారా లభిస్తాయని వివరించారు.

ప్రస్తుతం పెరుగుతున్న మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు కూడా యోగా ఎంతో ఉపయోగకరమన్నారు. ముఖ్యంగా మహిళలు యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.

యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్

యోగాను కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమం ఒకరోజు నిర్వహించే సాధారణ కార్యక్రమం కాదని, ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద నివారణ ఆరోగ్య (ప్రివెంటివ్ హెల్త్) ఉద్యమమని తెలిపారు. ప్రస్తుతం దేశంలో మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటి నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు జీవనశైలిలో మార్పులు అవసరమని పేర్కొన్నారు.

అందులో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే మధుమేహం, బీపీ వంటి సమస్యలు అదుపులోకి రావడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. యోగా ద్వారా ప్రజలు మరింత చురుకుగా, ఉత్సాహంగా జీవించగలరని వివరించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఈ ఒక్క రోజుతో పరిమితం కాకుండా యోగా సాధనను నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ కోరారు.

వృద్ధులకు యోగా అత్యంత అవసరం – ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు

యోగా అనేది ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత చికిత్స పొందే విధానం కాదని, రోగాలు రాకుండా ముందుగానే నివారించే ఉత్తమ సాధనమని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు.

గతంలో కూడా యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, చాలామంది యోగాను నిరంతరంగా కొనసాగించలేకపోతున్నారని అన్నారు. యోగాను ప్రతిరోజూ సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని తెలిపారు.

ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులకు యోగా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. వృద్ధాప్యంలో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్ వంటి క్రీడల్లో పాల్గొనడం సాధ్యం కాకపోయినా, ఇంటి వద్దే యోగా సాధన ద్వారా ఆరోగ్యంగా, చురుకుగా జీవించవచ్చని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, యోగాను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా జీవితంలో భాగంగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

యోగాతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం – జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ

జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ యోగా మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే గొప్ప సాధనమని అన్నారు.

తాను కూడా గత రెండు మూడు సంవత్సరాలుగా యోగా చేస్తున్నానని, అయితే దానిని క్రమశిక్షణతో నిరంతరం ఆచరిస్తే యోగాకు మించిన ఆరోగ్య సాధనం మరొకటి ఉండదని పేర్కొన్నారు. యోగా ద్వారా మనస్సును నియంత్రించుకోవడం, ప్రశాంతతను పొందడం సాధ్యమవుతుందని చెప్పారు.

యోగా మన ఆలోచనలను, భావోద్వేగాలను అదుపులో ఉంచడంతో పాటు శరీరంలోని ప్రతి అవయవం పనితీరును మెరుగుపరుస్తుందని తెలిపారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేసే వ్యక్తులు జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించే స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పొందగలరని అన్నారు.

కుటుంబ సభ్యులందరూ కలిసి యోగా చేస్తే ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చని పేర్కొన్నారు. యోగాను ప్రతి ఇంటికి చేరవేసి, ప్రతి ఒక్కరూ దానిని దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో చివరిగా, యోగా గురువులు రెబ్బా పోతన శాస్త్రి, ఘంటసాల గురునాధ బాబు, కే చందు, ముదిగొండ శాస్త్రిలను మంత్రి, జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కరించి అభినందించారు.

కార్యక్రమంలో ఇంచార్జి డిఆర్ఓ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, బందరు ఆర్డిఓ కే సాంబశివరావు, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డిపిఓ ధనలక్ష్మి, ఆయుష్ శాఖ అధికారులు డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ వాహిని, డిటిడబ్ల్యుఓ ఫణి ధూర్జటి, పర్యాటకశాఖ అధికారి రామ్ లక్ష్మణరావు, తదితర శాఖల జిల్లా అధికారులు, యోగా గురువులు శేష ప్రసన్న, మద్దాల చింతయ్య, శీలం రమేష్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, ఉద్యోగులు, స్థానిక నాయకులు, ఏపీ యోగసభ సభ్యులు, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *