– కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ.. కేంద్ర ప్రభుత్వంతో విస్తృత చర్చలు
– ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రం
– రోజువారీ కొనుగోళ్లు 150 బేళ్ల నుంచి 700 బేళ్లకు పెరుగుదల… త్వరలో 1200 బేళ్ల లక్ష్యం
– రైతులు అన్ని గ్రేడ్ల పొగాకును ఒకేసారి మార్కెట్కు తీసుకురావాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి సమన్వయంతో పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా, కొనుగోళ్లు వేగవంతం అయ్యేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం, పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో నిరంతర సంప్రదింపుల వలన పొగాకు బోర్డు ఈడీ, చైర్మన్ లకు కేంద్ర ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేయటంతో పొగాకు మార్కెట్ పరిస్థితులు, కొనుగోళ్ల పురోగతి, ఎగుమతుల స్థితిగతులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం పొగాకు బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో రైతులు, కొనుగోలు సంస్థలతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. రైతులు, కంపెనీల అభిప్రాయాలను సమగ్రంగా పరిశీలించి కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతం చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. అదే క్రమంలో పొగాకు బోర్డు చైర్మన్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ్ తో పాటు సంబంధిత ఉన్నతాధికారులను కలుసుకుని వర్జీనియా పొగాకు రైతుల పరిస్థితిని వివరించినట్లు చెప్పారు. రైతుల సమస్యలపై సానుకూల దృక్పథంతో స్పందించాలని కోరినట్లు వెల్లడించారు.
గత 15 రోజుల క్రితం మార్కెట్లో రోజుకు సుమారు 150 బేళ్ల స్థాయిలో మాత్రమే కొనుగోళ్లు జరిగేవని, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రైతులు, కంపెనీల మధ్య సమన్వయంతో ప్రస్తుతం ఇది సగటుగా 700 బేళ్లకు పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ ధోరణి కొనసాగితే వచ్చే వారం రోజుల్లో రోజుకు 1000 నుంచి 1200 బేళ్ల వరకు కొనుగోళ్లు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కంపెనీలు అవసరమైన గ్రేడ్ల వివరాలను సమావేశంలో తెలియజేశాయని, వాటి ఆధారంగా వారంవారీ కొనుగోలు లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిపారు. రైతులు అన్ని గ్రేడ్లను సమానంగా మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. అన్ని గ్రేడ్ల సమగ్ర ప్రవాహం ఉంటే కొనుగోళ్లు మరింత సాఫీగా జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అయ్యే పొగాకులో 30 శాతం దేశీయ వినియోగానికి వెళ్లగా, 70 శాతం ఎగుమతులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, రవాణా సమస్యలు, షిప్పింగ్ కంటైనర్ల కొరత వంటి కారణాలతో ఎగుమతి రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. కంటైనర్ రవాణా ఖర్చు సుమారు 1600 డాలర్ల నుంచి 4000 డాలర్ల వరకు పెరిగినట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ భారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని మంత్రి చెప్పారు. అలాగే ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ (Interest Subvention) కల్పించాలన్న ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య శాఖతో కూడా చర్చలు కొనసాగనున్నాయని తెలిపారు. రైతులు, కంపెనీలు, ఎగుమతిదారులు ఒకే వేదికపై కలిసి పనిచేస్తేనే ప్రస్తుత సవాళ్లను అధిగమించగలమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
Prajavartha Online Telugu News