-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ నెల 21న జరిగే రాష్ట్ర స్థాయి యోగాంధ్ర-2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పతంజలి రాందేవ్ బాబాను ఆహ్వానించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే 25వేల మందిని గ్రూపులుగా విభజించి రాందేవ్ బృందానికి చెందిన వారితోపాటు వివిధ యోగా అసోసియేషన్ల ప్రతినిధులు ఆసనాలు వేయిస్తారని చెప్పారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అనుసరించి యోగా అండ్ నేచురోపతి ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు, ఆయుష్ అధికారులు మర్యాదపూర్వకంగా ‘హరిద్వార్’ వెళ్లి బాబా రాందేవ్ ను నేరుగా ఆహ్వానించబోతున్నారని తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణ, జిల్లాల వారీగా పురోగతి, ఇతర అంశాలపై ఉన్నతాధికారుల తో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాందేవ్ శిక్షణ పొందుతున్న వారిలో కొందరు విద్యార్థులు ఈ నెల 21న రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. వీరు కూడా యోగాసనాలు చేస్తారని చెప్పారు. రాందేవ్ రాకతో యోగాకు మరింత ప్రాచుర్యం పెరుగుతుందని, యోగాంధ్ర ఖ్యాతిని పెంచుతుందని వెల్లడించారు.
విజయవాడకు వచ్చిన రాందేవ్ ప్రతినిధులు!
యోగాంధ్ర కార్యక్రమానికి రాందేవ్ హాజరవుతుండడంతో సన్నాహాక ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఆయన ప్రతినిధుల బృందం విజయవాడకు చేరుకుంది. ఈ బృందం మంగళగిరిలోని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొంది. రాష ‘వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ యోగాంద్ర -2026 కింద రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి రాందేవ్ బృందానికి వివరించారు. యోగాంధ్ర-2026 కింద చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకoగా ఉన్నాయని రాందేవ్ బృందం కొనియాడిoది
నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సంప్రదింపులు!
ఈ నెల 21న జరిగే రాష్ట్రస్థాయి యోగ యోగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు (కృష్ణా నదిపై) విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ హైవే అథా రిటీ ఆఫ్ ఇండియా అధికారులతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణ, బ్రిడ్జి సామర్థ్యం, ఇత ర అంశాలపై వారి మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు హై కెపాసిటీ ఆడియో, వీడియోల ఏర్పాటు, మీడియా స్టేషన్లు, బ్యారికేడ్స్ వంటి ఏర్పాట్లు జాతీయ రహదారిపై జరుగుతున్నాయి.
Prajavartha Online Telugu News