– సి.ఆర్. *మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రస్థుతం పేదలు పెత్తందార్ల మధ్యజరుగుతోన్న యుద్ధంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహనరెడ్డి పేదల పక్షాన నిలిచారని సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు అన్నారు. స్థానిక సత్యనారాయణ పురం లో నిర్వహించిన “జగనన్నబడుగు వికాశం” శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సు లో ఎస్. సి. ఎస్.టి. బిసి(సి) ఎంటర్ ప్రెన్యుర్ ల నుద్దేశించి ఆయన మాట్లాడారు. పేదల పక్షపాతి గా పేరుతెచ్చుకున్న ఇలాంటి ముఖ్య మంత్రి ని తమ 46 యేళ్ళ జర్నలిస్టు అనుభవంలో మొట్ట మొదటి సారి చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పేదలకోసం చెప్పింది చెప్పినట్లు చేస్తున్న ఈ ముఖ్యమంత్రి పై యుద్ధం చేయలేని కొంతమంది “వాలంటీర్ల” పై యుద్ధం చేస్తుండడం విచారకరమని ఆయన అన్నారు. ఎండలో, వానలో ఇబ్బందులు పడుతూ పెన్షన్ లు తెచ్చుకునే వృద్ధులకు యింటివద్దే, ఒకటోతేదీన పెన్షన్ లు సమర్ధవంతంగా అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ ను కించ పరచడం సరికాదని ఆయన అన్నారు. నేనూ సమాజంలో ప్రయోజనకారిగా వుండే వ్యక్తిని అని ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ముందుకెళ్ళాలని ఎస్.సి. ఎస్.టి. బి.సి(సి) ఎంటర్ ప్రెన్యుర్ లకు ఉద్బోధించారు. ప్రభుత్వం యిచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్వయంశక్తితో పది మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చేవారిని ప్రోత్సహించాలని ఆయన అన్నారు.
సామాజిక న్యాయం, సాధికారిత రాష్ట్ర సలహాదారు జూపూడి ప్రభాకర రావు మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్నవాళ్ళే అభివృద్ధి చెందుతారని అన్నారు.ఈ ప్రభుత్వంమనది, ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఆయనసూచించారు.
ఈ రాష్టంలో 2 లక్షల 25 వేల కోట్లు పేదలకు పంపిణీ అయ్యిందని, అందులో 80 శాతం మేర నిధులు ఎస్.సి.ఎస్.టి వర్గాలకే అందిందని ఆయన గుర్తుచేశారు. ఇది పేదల ప్రభుత్వమని చెప్పేందుకు ఇంతకుమించి ఉదాహరణ యేముంటుందని ఆయన ప్రశ్నించారు. 54 వేల ఎకరాల అసైన్డు భూములపై పేదలకు, దళితులకు సంపూర్ణ హక్కులు కల్పించిన ప్రభుత్వం యిదని ఆయన ప్రస్థుతించారు. గత 70 ఏళ్ళు గా తమ పేరున వున్న భూములపై పూర్తిహక్కులు ఈ వర్గాలకు లేవని, దళితుల, పేదల జీవితాలలో ఈ చర్య ద్వారా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన రెడ్డి పెను మార్పులకు దోహద పడ్డారని ఆయన తెలిపారు. ప్రపంచం మొత్తాన్ని కలిపే ఇంగ్లీషు భాష ప్రాధమిక విద్య లో ప్రవేశపెట్టిన సాహసి మన ముఖ్య మంత్రి అని ఆయన అన్నారు. దళితుల పిల్లలను ఇంగ్లీషు లో చదివించే విప్లవాత్మక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రిని విమర్శించడం సరికాదన్నారు.
సమావేశానికి క్రిస్టియన్ మైనారిటీస్ కార్పొరేషన్ చైర్మన్ బందెల దయానందం అధ్యక్షత వహించారు. సమావేశంలో సి.ఆర్.మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్, సెంట్రల్ బ్యాంకు రీజినల్ హెడ్ ఎస్. సూర్యనారాయణ మూర్తి, పరిశ్రమలశాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ.వి. పటేల్ , జాయింట్ డైరెక్టర్ ఏ. సుధాకర్, క్రిస్టియన్ మైనారిటీస్ కార్పొరేషన్ ఎం.డి. ఏ. శేఖర్, ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి వై. అశోక్ , ఎన్. హెచ్. ఆర్. ఏ. సి.సి. చైర్మన్ ఆర్.జె. రాజు, ఏ.ఎస్.ఎస్.ఎన్.టి. డైరెక్టర్ ఎన్. వెంకటరావు, వివిధ జిల్లాలనుంచి వచ్చిన ఎస్.సి. ఎస్.టి. ఎంటర్ ప్రెన్యూర్ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News