రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం బాలల దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు తూర్పు గోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం (అరసం) సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ సమీపంలోని గాంధీనగర్-2 మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి విద్యార్ధులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారత దేశానికి తొలి ప్రధానిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు అందించిన విశిష్ట సేవల గురించి వివరించారు. పిల్లల హక్కులు గురించి మాట్లాడుతూ పిల్లలను మానసికంగా వేధించడం, వారి పట్ల శారీరక హింసకు పాల్పడడం నేరమని పేర్కొన్నారు. పిల్లల హక్కులను హరించే ఎలాంటి చర్యనైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలని అన్నారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, కథల పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆ తరువాత కోటిపల్లి బస్ స్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల నందు జరిగిన బాలల దినోత్సవ వేడుకలో న్యాయమూర్తి ప్రత్యూష కుమారి పాల్గొన్నారు. “నేటి బాలలే భావి భారత నిర్మాతలు” అని నెహ్రూ చెప్పిన మాటలను గుర్తు చేశారు. అందరూ క్రమశిక్షణ, పట్టుదలతో మంచిగా చదువుకోవాలన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలతో బిక్షాటన చేయించడం మొదలగు దురాచారాలను పూర్తిగా అంతమొందించేందుకు అందరి తోడ్పాటు అవసరమన్నారు. ఎలాంటి న్యాయ సమస్యలున్నా న్యాయ సేవల ఉచిత హెల్ప్ లైన్ నెంబరు. 15100 ను సంప్రదించి లేదా నేరుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని వివరించారు.
Prajavartha Online Telugu News