– నిబద్ధతతో వాస్తవ గణాంకాలను నమోదుచేసి సహాయమందిద్దాం.
– ముంపు నష్టగణన ఎన్యూమరేషన్ బృందాలకు
-ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ) ఆర్‌పీ సిసోడియా దిశానిర్దేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు, వరద ముంపుతో నష్టపోయిన ప్రతిఒక్కరికీ న్యాయం జరగాల్సిన అవసరముందని.. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో ముందుకెళ్తోందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, భూపరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్) ఆర్‌పీ సిసోడియా అన్నారు.
వరద ముంపు నష్టాలను నమోదు చేసేందుకు ఏర్పాటుచేసిన బృంద సభ్యులకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, భూపరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్) ఆర్‌పీ సిసోడియా నేతృత్వంలో స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిసోడియా మట్లాడుతూ విజయవాడ నగరం, గ్రామీణ ప్రాంతాల్లో 170 సచివాలయాల పరిధిలో రెండు లక్షల 30 వేలకు పైగా నివాసాల్లో నష్టాన్ని గణించనున్నట్లు తెలిపారు. విజయవాడ రూరల్ మండలంలోని ఐదు గ్రామాలు సైతం నష్ట పోయాయన్నారు. అపారమైన వరద నష్టం అంచనాలో 149 మంది తహశీల్దార్లతో సహా పలువురి సేవలు వినియోగించుకుంటున్నామని, వీరందరినీ వివిధ జిల్లాల నుండి తీసుకోవడం జరిగిందన్నారు. గణనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రతి వార్డుకు ఒక ఐఎఎస్ అధికారి పర్యవేక్షిస్తారన్నారు. ఒక వార్డు లేదా గ్రామ సచివాలయం పరిధిలో 10 గణన బృందాలు ఉంటాయని.. ఈ బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన సమాచారాన్ని ఇళ్లు, వాణిజ్య వ్యాపార సంస్థల నుంచి తీసుకుంటారని సిసోడియా స్పష్టం చేశారు. కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ల నష్టం గణన కోసం 200 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నష్టపోయిన వారందరికీ పూర్తిస్దాయిలో న్యాయం జరిగేలా గణన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఆదేశించారని, ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమానికి బాధితులు పూర్తిసహకారం అందించాలని కోరారు. మొత్తం సమాచారాన్ని బాధితుల సమక్షంలోనే ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో నిక్ష్తిప్తం చేస్తారని సిసోడియా పేర్కొన్నారు. బాధితులు ఎంతో ఆవేదనతో ఉంటారని.. వారి బాధను అర్థంచేసుకొని మనస్ఫూర్తిగా సహాయసహకారాలు అందించి, కష్టం నుంచి గట్టెక్కెలా చేయడంలో ఎన్యూమరేషన్ బృంద సభ్యులు కీలకంగా వ్యవహరించాలని సిసోడియా సూచించారు. అదనపు సిసిఎల్ ఎ.ప్రభాకర్ రెడ్డి మూడు రోజుల కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారన్నారు.
శిక్షణ కార్యక్రమంలో మహిళాభి వృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి ఎ.సూర్య కుమారి, జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంకర్, ఎన్యూమరేషన్ బృందాలు పాల్గొన్నాయి.