తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమలేశుని మొక్కుబడి తీర్చుకోవాలనే పట్టుదలతో పట్టిన దీక్ష లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలిపిరి నడక దారిలో బయలుదేరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సనాతన ధర్మ పరిరక్షణ వైఫల్యాల ప్రభావం రాష్ట్ర ప్రజల పై పడకూడడనే సదుద్దేశ్యంతో పవన్ వారం రోజుల క్రితం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. చివరిరోజున తిరుమల లో తన దీక్ష ను విరమిస్తానని ప్రకటించారు.
ఆ ప్రకారం మంగళవారం సాయంత్రం కాలినడకన తిరుమలకు చేరుకొని రాత్రి బస చేసి బుధవారం తిరుమలేశుని దర్శించుకుని దీక్ష ను విరమించాల్సివుంది. అనుకున్న విధంగానే నిర్ణత సమయం కన్నా గంట ముందే ప్రత్యేక విమానం లో వచ్చిన ఆయన అలిపిరి కి కారులో చేరుకున్నారు. అక్కడ వందలాదిగా గుమికూడిన అభిమానులను చూసి కొంత సేపు కారులోనే కూర్చున్నారు.
వందలాది మందితో నడక చేపడితే ఇతర యాత్రకులకు కలిగే ఇబ్బందుల గురించి అందరితో చర్చించారు. ఆపై అక్కడినుంచి నేరుగా స్థానిక పద్మావతి విశ్రాంతి గృహం వద్దకు చేరుకున్నారు. ఆ దశలో అందరి ఇబ్బందిని దృష్టి లో ఉంచుకుని పవన్ కారులోనే తిరుమల వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ మరో అరగంట పాటు అందరితో చర్చించి మొక్కుకున్న విధంగా కాలినడకన నే తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
తిరుమల కు వెళ్లే శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్లాలంటే రక్షణ పరంగా చేసే ఏర్పాట్ల ఇబ్బంది చర్చకు వచ్చింది. స్వామికి మొక్కుకున్న విధంగా అలిపిరి గుండానే నడచి వెళ్తానని తీర్మానించుకున్నారు. ముందుగా తనతో వచ్చి యాత్రీకులను ఇబ్బంది అవుతుందని అభిమానులకు రావొద్దని విజ్ఞప్తి చేసారు. దాంతో అలిపిరి వద్ద పూజ చేసి అభిమానులకు అభివాదం చేసి సెలవు తీసుకుని రక్షక సిబ్బందితో కొందరు సన్నిహితులతో బయలుదేరారు.
అయినా వెంట పెద్ద సంఖ్య లోనే యువ అభిమానులు కదిలివెళ్లారు. ముందు ఉత్సాహంగా వేగంగా మొదలైనా క్రమంగా పలుచోట్ల అలుపు తీర్చుకోడానికి ఆగాల్సి వచ్చింది. తీవ్రమైన ఉక్కపోత కారణంగా కొంత సేపు కూర్చుండి పోయారు. ఇటీవల చేపట్టిన దీక్ష సందర్బంగా ఆహారం తక్కువగా తీసుకోవడం కూడా ఆ అలుపునకు కారణమని తెలుస్తోంది. వెంట ఉన్న సన్నిహితుడు ప్రముఖ సినీ కళా దర్శకుడు ఆనంద సాయి తో మాట్లాడుతూ అలుపు తీరాక తిరిగి నడక మొదలుపెట్టారు. గాలిగోపురం చేరుకున్న తరువాత కొంత విశాంత్రి తీసుకుని బయలుదేరారు. అనుకున్న సమయంకన్నా కొంత ఆలస్యంగా అయినా నడిచి వెళ్లి స్వామి కి మొక్కు తీర్చుకోవాలన్న పట్టుదలతో పవన్ కళ్యాణ్ కాలినడకన ముందుకుసాగారు. తిరుపతి ఎం ఎల్ ఏ శ్రీనివాసులు తదితర నాయకులు అలిపిరి నుంచి కారులో వెళ్ళిపోగా ఆయన వెంట పోలీసు సిబ్బంది, కొందరు సన్నిహితులు, పలువురు ఔత్సాహిక అభిమానులు, కొందరు మీడియా సభ్యులు నడచి వెళ్లారు.
పవన్ నడచి వెళ్లడం వల్ల ఆ మార్గం లో వెళ్లే యాత్రీకులకు ఎటువంటి ఇబ్బంది లేనివిధంగా పోలీసు అధికారులు ఏర్పాట్లు చేసారు. రాత్రి తిరుమలోని గాయత్రీ సదన్ లో బస చేయనున్న పవన్ బుధవారం స్వామిని దర్శించుకుని, వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఆహారం తీసుకుని రోజంతా తిరుమలలోనే ఉంటారని అధికారులు తెలిపారు.
గురువారం సాయంత్రం తిరుపతి బాలాజీ కాలనీ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే సెంటర్ లో వారాహి సభలో పాల్గొని రాత్రి తిరుగుప్రయాణం అవుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడో ఒక చోట ఆలయాల అపవిత్రతకు పరిస్థితులు దారి తీశాయి. తమ కూటమి ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా అటువంటి చర్యలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే దానిపై ప్రాథమిక ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు నేరుగా ఎలా ప్రకటన చేస్తారంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై స్పందించిన పవన్ . కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. న్యాయస్థానం ముందున్న సమాచారం ఆధారంగా ఆ వ్యాఖ్యలు చేసిందని తాను భావిస్తునట్లు తెలిపారు.
కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పలేదు కానీ.. తేదీ విషయంలో మాత్రమే కాస్త కన్ఫ్యూజన్ ఉందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఉల్లంఘనలు ఆలయాల విషయంలో చాలా జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం వాటిపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి అన్ని చర్యలు తీసుకుంటుందని, అలాగే దాదాపు 219 ఆలయాలను అపవిత్రం చేసినట్లు తెలిపారు. కాగా తాను దీక్ష చేపట్టడంపై పవన్ స్పందిస్తూ.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ముందుకు తీసుకువెళ్లాలనే దీక్ష చేపట్టారన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అవసరం ఇప్పుడు చాలా ఉందని, ఆ బోర్డు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఆలయాల పరిరక్షణకై ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు. తాను ఈ దీక్షను పూర్తి చేసిన తర్వాత, డిక్లరేషన్ చేస్తామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.