Breaking News

చేనేత, జౌళి శాఖ, ఆద్యం మధ్య అవగాహన ఒప్పందం

-నిరంతర పనిని కల్పించటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు నిరంతర పనిని కల్పించటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఈక్రమంలో ఆదాత్యా బిర్లా గ్రూపుకు చెందిన “ఆద్యం” హ్యాండ్-వోవెన్ తో కలిసి ముందడుగు వేసేందుకు సిద్దం అయ్యింది. హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖారాణి, ఆద్యం ప్రతినిధి మనిష్ సక్సేనాలు పరస్పరం అవగాహన ఒప్పందాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా రేఖారాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేతల అభ్యున్నతే ధ్యేయంగా తమశాఖను నడిపిస్తున్నారన్నారు. చేనేత ఉత్పతులకు తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించి, వాటికీ మెరుగైన ప్రాచుర్యం కల్పించాలన్న సిఎం ఆదేశాల మేరకు చేనేత, జౌళి శాఖ వివిధ సంస్థలతో కలిసి పనిచేసేందుకు సంప్రదింపులు జరుపుతోందన్నారు. ప్రస్తుత ఒప్పందంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ రాష్ట్ర చేనేత ఉత్పత్తులైన ఉప్పాడ (కాటన్ జమధాని), పులగుర్త (మల్కా ఖాదీ), అంగర (కాటన్ చీరలు) వెంకటగిరి (కాటన్ చీరలు), కోడుమూరు గద్వాల్ కాటన్ చీరలకు మెరుగైన మార్కెటింగ్ అవకాశం కల్పిస్తారని రేఖా రాణి వివరించారు.

అవగాహనా ఒప్పందం ఫలితంగా కార్మికులకు నిరంతరం పని కల్పించే సదవకాశం లభిస్తుందన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ప్రస్తుతం భారతదేశంలోని వారణాసి, పోచంపల్లి, భుజ్ ప్రాంతాలలోని నేత సంఘాలతో కలిసి పనిచేస్తుందన్నారు. చేనేత బ్రాండ్ యొక్క ప్రతిష్టను ఇనుమడింపచేసి, దేశంలోని అత్యుత్తమ కళాకారుల నైపుణ్యానికి మద్దతును అందిస్తూ, దేశ వ్యాప్తంగా విక్రయాలను ప్రోత్సహించటం ఆద్యం కీలక ఉద్దేశ్యంగా ఉందన్నారు. తద్వారా చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు పెంపొందుతాయని, మరోవైపు తరతరాలుగా వస్తున్న పురాతన నేత పద్ధతులను సంరక్షించి, అదే సమయంలో వారి వారసత్వం యొక్క నిజమైన నైపుణ్య పద్ధతులకు ప్రపంచవ్యాప్తంగా తగిన ప్రచారం లభింప చేస్తారని చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖారాణి వివరించారు.

చేనేత ఉత్పత్తులలో అగ్రగామి రాష్ట్రం ఎపి
చేతితో నేసిన బట్టల ఉత్పత్తిలో భారతదేశంలోని ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. రాష్ట్రంలో 1,77,447 చేనేత కార్మికులు పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత పరిశ్రమ తరతరాలుగా అభివృద్ధి చెందిన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. చేనేత పరిశ్రమ ఎల్లప్పుడూ జీవనోపాధిని కల్పించడం మరియు మానవ సృజనాత్మకతను ప్రదర్శించే మాధ్యమంగా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. ప్రతి జిల్లాలో విలక్షణమైన చేనేత రకాలను స్థానిక చేనేత కార్మికులు ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 35 ఓడిఓపి చేనేత ఉత్పత్తులు గుర్తించబడ్డాయి, వాటిలో 4 ఉత్పత్తులైన ఉప్పాడ జమధాని చీరలు, మంగళగిరి చీరలు, వెంకటగిరి చీరలు మరియు ధర్మవరం సిల్క్ చీరలు, పావడాలు జియోగ్రాఫికల్ ఇండికేషన్ హోదాను కలిగి ఉన్నాయి. ఇవి ఆ ప్రాంతం యొక్క సంస్కృతి సంప్రదాయాలను , కళాత్మకతను ప్రతిబింబిస్తాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *