-ప్రజల అవసరాలు జగనన్నకు బాగా తెలుసు
-సంక్షేమ పథకాలతో ఆర్థిక సమానత్వం సాధ్యమని జగనన్ననమ్మారు
-ప్రభుత్వ పాలన విషయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం
-ఫ్యామిలీ డాక్టర్ అనేది గతమెన్నడూ ఎరుగని విశిష్ట వైద్య విధానం
-మహిళాభ్యున్నతి దిశగా అద్భుతమైన అడుగులు
-నాడు – నేడు ద్వారా విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
-అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, పేదలందరికీ ఇళ్లు పథకాల ద్వారా మహిళకు ఆర్థిక స్వేచ్ఛ
-నవరత్నాల రూపంలో పేదలందరికీ అద్భుతమైన సంక్షేమ పథకాలు
-ప్రతి పథకం జగనన్న ఆలోచనల్లోంచి వచ్చిందే
-దేశంలోనే గొప్ప వైద్య విధానం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది
-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
-బెంగళూరు దక్షిణ్ డైలాగ్స్‌లో మంత్రి వ్యాఖ్యలు
-సౌత్ ఫస్ట్ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమపథకాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన దేశంలోనే గొప్ప ప్రామాణికంగా నిలుస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. సంక్షేమ పథకాలద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించొచ్చనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ మీడియా గ్రూప్ సౌత్ ఫస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరులో శనివారం దక్షిణ్ డైలాగ్స్… అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ భారత రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపై ఈ కార్యక్రమంలో మదింపు జరిగింది. ఆయా రాష్ట్రాల నుంచి ఐటీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దక్షణాధి రాష్ట్రాలకు ఒక అభివృద్ధి నమూనా ఉందా..? ఒకవేళ ఉంటే అది సరైన దారిలోనే ఉందా..?… అనే అంశంపై పానెల్ డిస్కషన్ నిర్వహించారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినితోపాటు కర్నాటక మాజీ ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్, కర్నాటక రాష్ట్ర ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు, తమిళనాడు ఐటీ మంత్రి పి.తియాగరాజన్ తదిరులు ఈ ప్యానెల్ డిస్కషన్‌లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ ఈ కార్యక్రమానికి మోడరేట్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ మన దేశంలోనే పరిపాలనలో ఒక గొప్ప రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకెళుతోందని చెప్పారు. తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆలోచనల్లోంచి అనేక సంస్కరణలు రూపుదిద్దుకున్నాయని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా 44.50 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొకరికి రూ.15వేలు చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమ ప్రభుత్వమని చెప్పారు. దీనివల్ల డ్రాప్అవుట్లు నివారించగలిగామన్నారు. అక్షరాస్యత శాతాన్ని పెంచగలిగామని చెప్పారు. నాలుగేళ్లలో ఏకంగా ఈ పథకం ద్వారా తమ ప్రభుత్వం 26,067.28 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని 46 వేల పాఠశాలలను నాడు – నేడు కింద అభివృద్ధి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని చెప్పారు. దశాబ్దాలుగా సర్కారీ స్కూళ్లను గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేస్తే… జగనన్న 17805 కోట్ల రూపాయాలతో పాఠశాలల రూపురేఖలు మార్చేశారని తెలిపారు. జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన కార్యక్రమాల ద్వారా జీరో నుంచి పీజీ వరకు విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందేలా చేసిన గొప్ప ప్రభుత్వం తమది అని చెప్పారు.
మహిళాభ్యున్నతి లోదేశానికే ఆదర్శం
నిజమైన మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తోందని మంత్రి విడదల రజిని తెలిపారు. వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 7.98 లక్షల మహిళా గ్రూపులకు చెందిన 19,178.17 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చెప్పారు. ఎన్నికల సమయంలోతమ నాయకుడు వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఇంత పెద్ద నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకున్నదని తెలిపారు. వైఎస్సార్ చేయూత అనే మరో గొప్ప కార్యక్రమాన్ని కూడా తమ ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ రాష్ట్రంలోని 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18750 చొప్పున నాలుగేళ్లలో ఏకంగా రూ.75 వేలు ఇస్తానని చెప్పారని, ఆ మేరకు రాష్ట్రంలోని అర్హులైన మహిళలందరికీ ఆర్థిక సాయం అందజేస్తున్నామని వివరించారు. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని 30 లక్షల మందికిపైగా మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు కూడా కట్టి ఇస్తున్నామని పేర్కొన్నారు. నవరత్నాలు పథకంలో భాగంగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం మహిళల కు ప్రాధాన్యత ఇచ్చేలా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఒక మహిళా మంత్రిగా ఈ విషయాన్ని చెప్పడం తనకు ఎంతో గర్వకారణమని తెలిపారు.
ఎన్నో సంక్షేమ పథకాలు
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో తమ పాలన కొనసాగుతోందని మంత్రి తెలిపారు. పేదలందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలనే ఆశయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా, వాహన మిత్ర , నేతన్న నేస్తం… ఇలా ఎన్నో పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు.
వైద్య ఆరోగ్య రంగంలో కనివినీ ఎరుగని సంస్కరణలు
ఏపీలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి కనీవిని ఎరుగని సంస్కరణలు ఈ నాలుగేళ్లో చేపట్టామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేశామని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టామన్నారు. దేశంలోనే ఈ విధానాన్ని అమలుచేస్తున్న తొలిరాష్ట్రంగా ఏపీ నిలిచిందని చెప్పారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు కూడా వైద్యాన్ని చేరువచేయగలిగామని తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రతను, వైద్యం అందించే విషయంలో ఒక హామీని తమ ప్రభుత్వం ఇవ్వగలిగిందని పేర్కొన్నారు. ఏకంగా రూ.16వేల కోట్ల రూపాయల ఖర్చుతో తమ రాష్ట్రంలోని ప్రైమరీ కేర్ నుంచి టెర్షియరీ కేర్ వరకు అన్ని ఆస్పత్రులను పూర్తి స్థాయిలో బలోపేతం చేశామన్నారు. ఈ మధ్యనే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం మొదలుపెట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా కీలకమైన టెస్టులు చేయడంతోపాటు ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది వైద్య ఆరోగ్య రంగంలో మరో మైలురాయి కార్యక్రమంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఐక్యంగా ముందుకు వెళితే గొప్ప మార్పు
దక్షణాధి రాష్ట్రాలు ప్రభుత్వ పరంగా ఐక్యంగా ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించొచ్చని మంత్రి విడదల రజిని తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం, భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాల ద్వారా తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారని పేర్కొన్నారు. వీక్షకుల నుంచి వచ్చి పలు ప్రశ్నలకు కూడా మంత్రి సమాధానాలు ఇచ్చారు. అందరికీ ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. అప్పుడే పుట్టిన పాప నుంచి వయసు మీరు మరణం అంచున ఉండే వృద్ధుల వరకు అన్ని వయసుల వారికి ప్రభుత్వ వైద్యం పూర్తి ఉచితంగా అందేలా ఇప్పటికే తమ ప్రభుత్వం అన్ని చర్యలుతీసుకున్నదని పేర్కొన్నారు.