మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో మచిలీపట్నం అభివృద్ధికి ఒక ఉమ్మడి ప్రణాళికను తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక వరలక్ష్మి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గల మచిలీపట్నం అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (ముడా) కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన మచిలీపట్నం అర్బ న్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ఎంతో బాధ్యతతో అప్పజెప్పిన ఈ పదవిని సక్రమంగా నిర్వర్తించి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
మచిలీపట్నం పోర్టు నిర్మాణం కొన్ని దశాబ్దాల కల అని, రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ పోర్టును పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో అత్యంత కీలకం కానున్నదని తెలిపారు. రాష్ట్రం ముఖ్యమంత్రి ఆశయం మేరకు ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తనకు ఈ పదవిని కట్టబెట్టారని, అందుకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యులు, మంత్రుల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానన్నారు.
కేవలం మచిలీపట్నం పరిసర ప్రాంతాలు మాత్రమే కాకుండా ముడా పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి రానున్న కాలంలో అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ముడా పరిధిలోని భూములు, ఆస్తులు, అప్పులపై ప్రజలకు ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉంటామని, అదేవిధంగా అనేక విషయాలలో ముడా ఆస్తులను కాపాడే విధంగా బాధ్యతగా వ్యవహరిస్తామన్నారు.
ముడా పరిధిలో జరిగే అక్రమ లేఔట్లు, మట్టితోలకాలు వంటి అవకతవకలపై అధికారులతో చర్చించి అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల అవసరార్థం ముడా కార్యాలయ తలుపులు 24 గంటలూ తెరిచే ఉంటాయని, ఎలాంటి జాప్యం లేకుండా వారికి తక్షణ ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని, దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులతో చర్చించామని, వారు అందుకు సానుకూలంగా స్పందించారని ఆయన వివరించారు. స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, ముడా వైస్ ఛాన్స్లర్ జాయింట్ కలెక్టర్ల సహకారంతో అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ముడా పని చేస్తుందని అన్నారు.
ఈ గురుతర బాధ్యతలో మీడియా భాగస్వామ్యం కావాలని, ఉన్న సమస్యలు, లోపాలను ఎత్తిచూపడం ద్వారా వాటిని సరి చేసుకుంటామన్నారు. మీడియా కళ్ళు, చెవులుగా వ్యవహరించి ముడా చైర్మన్, అధికారులకు సహకారం అందించాలని విలేకరులను కోరారు.
Prajavartha Online Telugu News