విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు. స్థానిక లబ్బీపేట, పున్నంతోట, వెంకటేశ్వరపురం లలోని సచివాలయాలు శనివారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా సచివాలయాలలో ప్రజలకు సిబ్బంది అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ అర్హులైన ప్రతీ నిరుపేదకు సంక్షేమ ఫలాలు దక్కాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. సంక్షేమ పథకాల అమలు వేగవంతం అయ్యేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసారని, ఆ లక్ష్యాన్ని పూర్తిస్థాయి లో చేరేందుకు ప్రతీ సచివాలయ ఉద్యోగి కృషి చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులపై ముఖ్యమంత్రి ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనితీరు కనపరచాలన్నారు. ప్రజలలో నిరక్షరాస్యులు కూడా ఉంటారని, పెన్షన్, గృహం మంజూరు, రైతు భరోసా, తదితర పధకాల లబ్ధికి వారు దరఖాస్తు చేసుకునే విధంగా చైతనవంతులను చేయాలనీ, అవసరమైతే దరఖాస్తు నింపడంలో , దరఖాస్తు సమర్పించడంలో వారికీ సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్ధిదారుల జాబితాలను తప్పనిసరిగా ప్రతీ గ్రామ/వార్డ్ సచివాలయాలలో ప్రదర్శించాలన్నారు. అంతే కాక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలు, సమాచారాన్ని గ్రామ/వార్డ్ సచివాలయాలలో ప్రజలకు తెలియజేసేలా ప్రదర్శించాలన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట రెవిన్యూ అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …