-పర్యావరణ సుస్థిరత , సామాజిక, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ఊర్జావీర్ కార్యక్రమం
-డిసెంబర్ 7 న కృష్ణా జిల్లాలలోని పోరంకిలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న
-సిఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి మనోహర్ లాల్
-ఈఈఎస్ఎల్ సహకారంతో ఏపీలో ఊర్జావీర్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం.
-నేటి కార్యక్రమ సభా వేదిక ను సందర్శించి సమీక్షించిన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్న ఊర్జవీర్ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ వేదిక కావడం ఎంతో గర్వకారణమని, ఈ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ చేతుల మీదుగా శనివారం ప్రారంభం అవుతోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. ఊర్జవీర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఏపీ జెన్కో ఎండీ, కేవీఎన్ చక్రధర్ బాబు, ఏపీట్రాన్స్కో జెఎండీ కీర్తి చేకూరి, డిస్కమ్ల సిఎండిలు పట్టంశెట్టి రవి, ఐ పృధ్వి తేజ్, జిల్లా కలెక్టర్ డీ.కె బాలాజీ , జిల్లా ఎస్పీ గంగాధర్ , కె సంతోషరావు, ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ, బీఏవీపీ కుమార రెడ్డి, ఈఈఎస్ఎల్ స్టేట్ హెడ్ పవన్ తదితర సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు.
ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్వయంగా సీఎం కార్యక్రమం జరగనున్న ప్రదేశానికి వెళ్లి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం లో ఇంధన సామర్థ్యం, సుస్థిరతను పెంపొందించే లక్ష్యంలో భాగంగా , ఆర్థికాభివృద్ధితో పాటు ఇంధన , పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఇంధన -సమర్థవంతమైన ఉపకరణాలను ప్రోత్సహించే ఉద్దేశం తో ఊర్జావీర్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎర్జీన ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) సహకారంతో ఈ నెల 7వ తేదీన (శనివారం) కృష్ణా జిల్లాలోని పోరంకి లో ప్రారంభించబోతోందని ఆయన తెలిపారు. ఈ వేదిక పై జాతీయ ఇంధన సామర్ధ్య గృహోపకరణాల కార్యక్రమం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన – హౌసింగ్ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి , కేంద్ర మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, పార్లమెంట్ సభ్యులు, మచిలీపట్నం, వల్లభనేని బాల శౌరి, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి, కృష్ణా జిల్లా ఇంచార్జి మంత్రి, కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు , బీమా, వైద్య సేవల శాఖ మంత్రి, వాసంశెట్టి సుభాష్, గనులు, భూగర్భ శాస్త్రం, ఎక్సైజ్ శాఖల మంత్రి, కొల్లు రవీంద్ర, స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పెనమలూరు MLA బోడే ప్రసాద్ తో పాటు ఇతర స్థానిక మంత్రులు , కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారని ఆయన వివరించారు.
ఊర్జావీర్ కార్యక్రమం పర్యావరణ సుస్థిరత , సామాజిక, ఆర్థిక పురోభివృద్ధి రెండింటికీ ఉద్దేశించిన విశిష్ట కార్యక్రమం అని అన్నారు. “పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ద్వారా ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో ఇంధన పరిరక్షణ ప్రాముఖ్యతను పెంపొందించడంలో ఊర్జావీర్ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఊర్జావీర్ కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో స్థానిక ఎలక్ట్రీషియన్లకు శిక్షణ ఇచ్చి ఉర్జావీర్లుగా మార్చనున్నారని ఆయన వివరించారు.
సాధారణ ప్రజలకు ఇంధన సామర్థ్య ఉపకరణాలను సులభతరం చేసేందుకు ఉర్జవీర్ పథకం కింద 1,12,000 మంది ప్రైవేట్ రిజిస్టర్డ్ ఎలక్ట్రీషియన్లను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 6W LED బల్బులు, 10W LED ఇన్వర్టర్ బల్బులు, 20W LED ట్యూబ్ లైట్లు, 30W BLDC సీలింగ్ ఫ్యాన్లు, 5-స్టార్ రేటెడ్ ఎయిర్ కండిషనర్లు, ఇండక్షన్ వంట స్టవ్లతో సహా ఆరు రకాల ఇంధన -సమర్థవంతమైన ఉపకరణాలను ప్రోత్సహించడానికి శిక్షణ పొంది, నమోదు చేసుకున్న ఉర్జావీర్ల ను పెద్ద సంఖ్యలో తయారు చేయడానికి ఈ కార్యక్రమం రూపొందించబడిందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు.
శిక్షణ పొందిన ఉర్జావీర్లు ఇంధన-సమర్థవంతమైన ఉపకరణాలను ప్రోత్సహించడమే కాకుండా వాటి ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని, అవగాహన పెంచడానికి , ఇంధన-పొదుపు సాంకేతికతలను స్వీకరించడానికి సహాయపడతారని ఆయన అన్నారు. అదనంగా, ఉర్జావీర్లు eeslmart.in పోర్టల్ ద్వారా విక్రయించే ప్రతి ఉపకరణం కోసం నిర్ణయించిన మొత్తాన్ని పొందవచ్చునని ఆయన తెలిపారు.
ఊర్జావీర్ ప్రోగ్రామ్ అట్టడుగు స్థాయిలో ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి ఒక కీలకమైన అడుగని , ఇంధన పొదుపును ప్రజల జీవన శైలిగా మార్చడానికి ఇది ఒక ఉపయోగకరమైన కార్యక్రమం అని పేర్కొన్నారు . ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ ఇంధన – పొదుపు లక్ష్యాలకు దోహదం చేయడమే కాకుండా, ఆర్థికంగా ప్రయోజనం పొందుతుందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ చెప్పారు.
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్ (NECP) అమలు కోసం కూడా ఈ ఈ ఎస్ ఎల్ సహకరిస్తుందని ఆయన తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కంపెనీ లిమిటెడ్ (APSHCL) సమన్వయంతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కిం అమలు చేయటంలో కూడా ఈ ఈ ఎస్ ఎల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కు సహకరిస్తుందని. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంధన-సమర్థవంతమైన ఉపకరణాలను అందించడానికి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL)తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కంపెనీ లిమిటెడ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ ( ఎంఓఏ) చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News