గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాల ద్వారా విద్యా రంగంలో నూతన ఒరవడికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. శనివారం రైల్ పేటలోని గొలుసు నాంచారమ్మ కొండలరావు మున్సిపల్ హైస్కూల్, జలగం రామారావు మున్సిపల్ హైస్కూల్లో జరిగిన ఆత్మీయ సమావేశాల్లో కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాల ఏర్పాటు ద్వారా విద్యా రంగంలో నూతన ఒరవడికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లకు చదివే పాఠశాల వాతావరణం, పిల్లల ప్రోగ్రెస్ ని నేరుగా పరిశీలన చేయడానికి వీలు కల్గుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవాలని, వారి ప్రవర్తన, మిత్రులు, ఆలోచన విధానంను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. విద్యార్ధులు కూడా తమ తల్లిదండ్రులు తమ మీద పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా కష్టపడి చదువుకోవాలని, ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుండి క్రమపద్దతిలో చదువుకొన్న వారేనన్నారు. విద్యార్ధులు తమ లక్ష్యాన్ని తాము ఎక్కువ సమయం గడిపే ప్రదేశంలో స్టిక్ చేసుకొని నిత్యం లక్ష్య సాధనపై దృష్టి సారించాలన్నారు.
డిప్యూటీ మేయర్ షేక్ సజిలా మాట్లాడుతూ విద్యార్దులు చదువు అనంతరం ఉన్నత స్థానంలో నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేలా ఆత్మీయ సమ్మేళనాలు దోహాద పడుతాయన్నారు.
తూర్పు డిఎస్పీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధితో పాటు సమస్యలు కూడా అధికంగా ఉంటున్నాయని, పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. ఆడ పిల్లలకు ఏ సమస్య ఎదురైనా గుంటూరు జిల్లా పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన మహిళా మీ కోసం కు కాంటాక్ట్ కావాలని లేదా 112 కి కాల్ చేయవచ్చని తెలిపారు.
అనంతరం తల్లిదండ్రులకు, విద్యార్ధులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలిచిన వారికి ప్రశంశా పత్రాలు అందించారు.
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పి.సమత, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సుధారాణి, ప్రమీల రాణి, పేరెంట్స్ కమిటి చైర్మన్లు ఫర్హనా, వెంకటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, బాలజి బాష తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News