-ఈనెల 22న 10 వేలమందికి ఇళ్ల నిర్మాణాలకు రుణమంజూరు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వై.యస్.ఆర్. చేయూత యూనిట్లను నెలకొల్పేందుకు ప్రతీ శుక్రవారాన్ని గ్రౌండింగ్ డేగా జిల్లా కలెక్టరు జె. నివాస్ నిర్దేశించారు. వైయస్ఆర్ చేయూత క్రింద పాడి పశువులు, గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణి క్రింద 15 వేల యూనిట్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈమేరకు ఇంతవరకూ 9298 పాడి పశువుల యూనిట్లకు డాక్యుమెంటేషన్ పూర్తి చేయగా, గొర్రెలు, మేకల యూనిట్లకు సంబంధించి 2272 మంది లబ్ధిదారుల డాక్యుమెంటేషన్ పూర్తి చేశారు. ఈయూనిట్లను క్షేత్రస్థాయిలో గ్రౌండింగ్ చేసేందుకు ప్రతీ శుక్రవారాన్ని గ్రౌండింగ్ డేగా నిర్వహించి యూనిట్ల స్థాపన జరి గేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టరు జె. నివాస్ ఆదేశించారు. జిల్లాలో జగనన్న ఇళ్ల కాలనీల్లో ఇళ్లు మంజూరైన యస్ హెచ్ఓ గ్రూపుల్లోని సభ్యులకు ఇళ్ల నిర్మాణానికి కనీసం రూ. 50 వేల చొప్పున రుణసౌకర్యం కల్పించాలన్న జిల్లా కలెక్టరు జె.నివాస్ బ్యాంకర్లను కోరారు. ఈమేరకు బ్యాంకర్లు ఇందుకు తమ పూర్తి సంసిద్ధ తను వ్యక్తం చేశారు. గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధ్యక్షతన ఈనెల 22వ తేదీన జరిగే గృహనిర్మాణ సమీక్షా సమావేశంలో కనీసం 10 వేలమంది యస్ హెచ్ ఓ గ్రూపుకు చెందిన ఇళ్ల లబ్దిదారులకు ఈరుణాలు అందించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో స్టాండ్ అప్ ఇండియా క్రింద 1100 పరిశ్రమల యూనిట్లు నెలకొల్పాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ బ్యాంకర్లకు చేసిన సూచన మేరకు వారు ఆదిశగా పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా ప్రతీ బ్యాంకు బ్రాంచి నుంచి తప్పనిసరిగా ఒక యస్ సి లేదా యటి కులానికి చెందినవారికి, కులంతో సంబంధం లేకుండా ఒక మహిళకు రుణసదుపాయం కల్పించేందుకు బ్యాంకర్ల చొరవ చూపాలని కలెక్టరు చేసిన సూచనకు బ్యాంకర్లు సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా పంటసాగుహక్కుపత్రాల పంపిణీ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పంటరుణాలు అందించడంలో బ్యాంకర్లు మరింత ఉదారత చూపాలని ముఖ్యంగా కౌలు రైతులకు రుణాలు అందించడంలో మరింత చొరవ చూపాలని కలెక్టరు బ్యాంకర్లను నిర్దేశించారు.