-రాజకీయ నేతల్లో కొరవడుతున్న మానవత్వం
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ప్రకటించిన విజన్-2047, మోడీ చెబుతున్న వికసిత భారత్‌కు భజనలా ఉందనిÑ పేద, ధనిక తారతమ్యాలు రూపుమాపకుండా స్వర్ణాంధ్ర విజన్ ఎలా సాధ్యమని? సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఘాటుగా విమర్శించారు.
స్థానిక దాసరి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సీఎంగా వుండగా స్వర్ణాంధ్ర విజన్-2020 అంటూ ఊదరగొట్టారని, కాని పేద, ధనిక వర్గాల మధ్య తారతమ్యం ఏమాత్రం మారలేదన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చెపుతున్న వికసిత్ భారత్‌కు అనుగుణంగా రాష్ట్రంలో చంద్రబాబు విజన్`2047 అనడం మోడీకి బాకా ఊదినట్లు ఉందన్నారు. చంద్రబాబు వాస్తవాల్ని కాకుండా అబద్ధాలను చెపుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ వాగ్ధానాలు చేశారని గుర్తు చేశారు. రైతులకు రూ.20 వేలు సాగుసాయం, నిరుద్యోగ భృతి, తల్లిదీవెన, మహిళలకు నెలవారీ రూ.1500 వంటి పథకాలను అమలు చేయటంలో శ్రద్ధచూపటం లేదన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళాతీసిన నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా పెద్దగా విమర్శలు చేయటం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న 3 వేల డాలర్ల తలసరి ఆదాయాన్ని 2047 నాటికి 42 వేల డాలర్లు చేస్తామని చెప్పటం, పేద, ధనిక వర్గాల మధ్య అంతరాన్ని తగ్గిస్తామని చెప్పటం విడ్డూరంగా వుందన్నారు. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.82గా ఉందని, 2047 నాటికి డాలర్ దాదాపు రూ.200కు చేరుతుందని, అంటే తలసరి ఆదాయం రూ.84 లక్షలకు చేరుస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అది ఎలా సాధ్యమో అర్థం కావటం లేదన్నారు. చంద్రబాబు బహుశా ఎన్నారైల ఆదాయం కూడా పరిగణనలోకి తీసుకున్నట్లుగా ఉన్నదన్నారు. గతంలో 15 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పేద, ధనిక వర్గాల మధ్య తేడా ఏమైనా తగ్గిందా? అని ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో 500 మంది బిలియనీయర్ల సంపద విపరీతంగా పెరిగిందన్నారు. మోడీ కార్పొరేట్‌లకు ఊడిగం చేయడం వల్లే అదానీ, అంబానీలు ప్రపంచ కుబేరులుగా మారారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విజన్`2047 డాక్యుమెంట్‌పై సమగ్ర చర్చ జరగాలని, అఖిలపక్షాలు, మేధావులు, ఆర్థిక వేత్తలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చను జరపాలని డిమాండ్ చేశారు.
ఇటీవల విడుదలైన పుష్ప`2 సినిమా చూడటానికి వచ్చిన మహిళ తొక్కిసలాటలో చనిపోవడం బాధాకరమని, ఆమె 9 ఏళ్ల కుమారుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా, కనీస మానవత్వం లేకుండా రాజకీయాలకు కక్కుర్తిపడి కేంద్రమంత్రి బండి సంజయ్, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకున్న సినిమా హీరోకి వత్తాసుగా మాట్లాడటం నీచాతినీచమన్నారు. రాజకీయ నేతలు ఓట్లకోసం సినిమా హీరోలకు ఊడిగం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పుష్ప`2 సినిమా టిక్కెట్ ధరలను రూ.1000లకు పెంచడం దారుణమన్నారు. ఒకపక్క రైతాంగం చెమటోడ్చి, కష్టపడి పండించిన పంటలకు ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర కూడా కల్పించలేకపోతున్నాయని, మరోపక్క పెద్ద హీరోల సినిమాలకు టిక్కెట్లు రేట్లు పెంచేందుకు ఎపీ, తెలంగాణా ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సినిమా టికెట్టు ధరలు పెంచవద్దని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా సినిమాలు ఆడుతున్నాయని, తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ధరలు పెంచడం తగదన్నారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, అక్కినేని వనజ, ఎఐకెఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News