Breaking News

కరుణామయుడు చూపించిన మార్గం నేటి సమాజానికి అవసరం…

-ఏసుప్రభు ప్రవచనాలు మంచి సమాజానికి మార్గదర్శనం
-ఏసుప్రభు ఆచరించిన త్యాగమార్గాన్ని ఆదర్శంగా తీసుకుందాం
-క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏసు ప్రభు బైబిల్ గ్రంధం ద్వారా మానవాళికి అందించిన ప్రవచనాలు మంచి మార్గాన్ని, అద్భుతమైన జీవితాన్ని గడిపేందుకు, శాంతియుత సమాజ స్థాపనకు దోహదపడతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గవర్నర్ పేటలోని సెయింట్ పాల్స్ బాసిలికా సిఎస్ఐ చర్చిలో మంగళవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సహోదరులను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.
మనిషికి మనిషికి అంతరం పెరిగిపోతున్న ఈ తరుణంలో ప్రేమ, సహనం, ఓర్పు, ఏసు ప్రవచనాలతోపాటు కరుణామయుడు చూపించిన మార్గం నేటి సమాజానికి అవసరమన్నారు. తన సిలువకు కారణమైన వారిని, పాపులను సైతం క్షమించగలిగిన ఉదాత్తమైన హృదయం కలిగిన ఏసుక్రీస్తును ఆరాధించడమే కాకుండా ఆయన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. తనను తాను తగ్గించుకున్న వాడు దేవుడి మనసులో హెచ్చింపబడుతారని, నిన్ను వలె నీ పొరుగు వారిని సైతం ప్రేమించాలి అన్న ఏసుప్రభు పేర్కొన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా లక్ష్మీశ చదివి వినిపించారు. ప్రజలంతా అన్నదమ్ముల వలె కలిసి మెలిసి ఉండాలని పిలుపునిచ్చారు.
క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను సక్రమంగా వినియోగించుకుని విద్య, ఉపాధి రంగాలలో క్రైస్తవులు అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. క్రైస్తవ మతంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం సేవా మార్గమన్నారు. జిల్లాలోని ఎంతోమంది క్రైస్తవ ప్రార్థన మందిరాల నిర్వాహకులు విద్యా రంగానికి ఎంతో సేవ చేస్తున్నారని అభినందించారు. ప్రధానంగా అట్టడుగు వర్గాల వారికి వివిధ రూపాల్లో సహాయం అందిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చిల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన క్రైస్తవ ప్రార్థన మందిరాల నిర్వాహకులు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని పొందాలన్నారు. కర్ణాటక రాష్ట్ర ఐఏఎస్ అధికారి, మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ (కర్ణాటక) అదనపు కార్యదర్శి కొర్లపాటి హెప్సీబా రాణి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టిన ప్రభుత్వం క్రైస్తవ సహోదరుల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. ఇటువంటి మంచి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే క్రైస్తవులు తమ తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరించుకునేందుకు మత పెద్దలు ముందుకు రావాలన్నారు. ప్రధానంగా విద్య, వైద్య రంగాల సేవలను ప్రతి పేదవాడికి అందించేందుకు చర్చిల నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ వేడుకల్లో
సి.ఎస్.ఐ కృష్ణా-గోదావరి డయోసిస్ బిషప్ టి. జార్జ్ కార్నెలియస్, చర్చి పాస్టర్లు టి. డానియల్ దిలీప్, రెవరెండ్ జి. వాగ్దాన బాబు, కె. రోనాల్డ్, చర్చి కార్యదర్శి ఎం. ఏలియా, కోశాధికారి పి. అగస్టీన్ తదితరులతో పాటు వేలాది మంది క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *