-నేటి (శుక్రవారం) నుండి మూడు రోజులపాటు కళాభిమానులకు కనువిందు…
-పూర్తి ఏర్పాట్లతో అధికారులు సిద్ధం….
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రసిద్ధ నాట్య క్షేత్రమైన కూచిపూడిలో ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు రష్యా, కెనడా, అమెరికా, జపాన్, జర్మనీ తదితర దేశాల నుండి కళాకారులు నాట్య ప్రదర్శనలతో సిద్ధేంద్రుడు నీరాజనాలు అందుకోనున్నారన్నారు.
కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కేంద్ర సాంస్కృతిక శాఖ, రాష్ట్రానికి చెందిన క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకల్ని జిల్లా ఇన్చార్జి మంత్రి , రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్, ఇతర మంత్రులు, శాసనసభ్యులు ప్రారంభించనున్నారని తెలిపారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ డాక్టర్ వేదాంతం వెంకట నాగచలపతి (వెంకు), కమిటీ సభ్యుల పర్యవేక్షణలో తొలి రోజైన 27వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలకు నగర సంకీర్తన, 7 గంటలకు నాట్యశిక్షణా శిబిరం, 9 గంటలకు 50 అడుగుల పతాక స్తూపం ఆవిష్కరణ, 9:30 గంటల నుంచి సదస్సులు, రాత్రి 11 గంటల వరకు నాట్య ప్రదర్శనలు ఉంటాయని,
28వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు నగర సంకీర్తన, నాట్య శిక్షణ శిబిరం, సెమినార్ పుస్తకావిష్కరణ, అతిథిల ఉపన్యాసాలు, కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఉంటాయని. చివరి రోజైన 29 ఆదివారం ఉదయం 6 గంటల నుంచి నగర సంకీర్తన,నాట్య శిక్షణ, సాయంత్రం 2 వేల మంది కళాకారులతో మహా బృందనాట్యం ఇతర ప్రదర్శనలు ఉంటాయన్నారు.
మూడు రోజులపాటు నిర్వహించే స్వర్ణోత్సవాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడికి గుర్తింపుతో ప్రతి ఒక్కరూ గర్వపడేలా విజయవంతం చేయాలన్నారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చే కళాకారుల ప్రదర్శనలకు అధికారులు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ముగింపు కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజుతోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.
Prajavartha Online Telugu News