గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రోజు రోజుకి పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్వహణకు కెఓపి ఫౌండేషన్ కృషి అభినందనీయమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో కెఓపి ఫౌండేషన్ వారు ఈ-వ్యర్ధాల నిర్వహణపై రూపొందించిన వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈనెల 28న రత్నటాటా జయంతి సందర్భంగా కెఓపి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ లోని క్రోమా షోరూమ్ లో ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు అందిస్తే వారి పేరుతో ఒక మొక్కను నాటి, ఈ-సర్టిఫికెట్ అందిస్తారన్నారు. ఈ-వ్యర్ధాల నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని, కనుక నగర ప్రజలు తమ ఇంటిలోని వినియోగంలో లేని మొబైల్స్, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అందించి పర్యావరణ పరిరక్షణలో భాగాస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో కెఓపి ఫౌండేషన్ చైర్మన్ బి.నిశ్చల్, గుంటూరు రౌండ్ టేబుల్ 86 సభ్యులు జె.రాము, ఏ.రాకేష్, ఏ.వంశీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News