Breaking News

వీఆర్వోలపై పని వత్తిడి తగ్గించాలి… : భూపతిరాజు రవీంద్ర రాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం సమావేశం జరిగింది. వీఆర్వోలపై అధిక పని వత్తిడి ఉందని, దీనికితోడు ఇతర శాఖ అధికారులు మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తుండటంతో వారు మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం దృష్టి సారించి తమ సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు కోరారు. ఆదివారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రవీంద్ర రాజు మాట్లాడుతూ 2021 సంవత్సరం నుంచి వీఆర్వోలు నిర్వహించిన ప్రత్యేక విధులకు రావలసిన బకాయిలు రాకపోవడంతో ఆర్థిక మంత్రి దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లగా రూ.58 కోట్ల బడ్జెట్‌ విడుదల చేయటం సంతోషించదగిన విషయమని అన్నారు. 2019 నుంచి 2024 వరకు వాలంటీర్‌ చేసిన పనులన్నీ వీఆర్వోలు చేస్తున్నారని తెలిపారు. ఉదయం ఐదు గంటలకే పింఛన్లు అందజేయాల్సి రావడంతో సచివాలయ సిబ్బందిలోని మహిళలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం సామాజిక పింఛన్లు ఉదయం 10 గంటలకు పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. బయోమెట్రిక్‌ వేస్తేనే జీతాలు ఇవ్వటమనేది, సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత వీఆర్వోలు పనిచేయటం లేదని ఆరోపించడం సరైన విధానాలు కావని అన్నారు. గ్రేడ్‌ వన్‌ స్థాయిలో ఉన్న వీఆర్వోలకు ప్రమోషన్‌ ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం 120 రోజుల్లో భూముల రీ సర్వే చేయాలని మంత్రివర్గంలో ఆమోదించడం సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ప్రభుత్వ ఉద్యోగస్తులను పట్టించుకోవడం లేదని, ఈ వైఖరి పట్ల ఉద్యోగులలో అసంతృప్తి చాలా ఉందని అన్నారు. వెంటనే డీఏ విడుదల చేయాలని, వీఆర్వో పోస్టులు కూడా భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు, ఉపాధ్యక్షులు మిర్యాల లక్ష్మీనారాయణ, బి.మురళీకృష్ణ, రాధాకృష్ణ, చైతన్య, అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *