– భావితరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని వారసత్వంగా అందిద్దాం..
– 2025, మార్చి 31 నాటికి రెండు లక్షల ఇళ్లు సూర్య ఘర్‌లుగా మారాలి
– పథకం అమల్లో ఎన్‌టీఆర్ జిల్లాను నెం.1గా నిలపాలి
– లక్ష్య సాధనలో పొదుపు సంఘాల మహిళా శక్తి కీలక భాగస్వామ్యం కావాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా జిల్లాలోని ప్రతి ఇంటా సూర్యఘర్‌తో ఆర్థిక స్వావలంబన వెలుగులు నిండాలని, పథకాన్ని సద్వినియోగం చేసుకొని భావితరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని వారసత్వ సంపదగా అందిద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
శనివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డీఆర్‌డీఏ, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సూర్యఘర్ పథకం ద్వారా అధిక రాయితీతో చాలా తక్కువ పెట్టుబడితో ఉచితంగా సౌర విద్యుత్‌ను పొందవచ్చని.. దీనివల్ల కుటుంబాలకు ఆర్థికంగా చేయూత లభించడంతో పాటు పర్యావరణ సమస్యలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. 25 ఏళ్ల కాలంలో పథకం ద్వారా 1000 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 720 మిలియన్ టన్నుల మేర కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చంటే.. పర్యావరణం పరంగా ఈ పథకం ద్వారా ఎంత మేలు జరుగుతుందో, భూతాపానికి ఏమేరకు అడ్డుకట్ట పడుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రూ. 2 లక్షల విలువైన 3 కేడబ్ల్యూ సోలార్ ప్యానెల్‌ను రూ. 78 వేల రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రూ. 20 వేలు లబ్ధిదారు వాటాపోను మిగిలిన మొత్తాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందొచ్చన్నారు. నాలుగైదేళ్లలోనే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని, దాదాపు 20 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ పొందొచ్చన్నారు. మన అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా యూనిట్‌కు రూ. 2.09 ఆదాయం పొందొచ్చని, ఈ విధంగా గత మూడు నెలల్లో జిల్లాలో 500 సూర్య ఘర్ కనెక్షన్లకు విద్యుత్ సంస్థలు రూ. 22 లక్షలు చెల్లించాయని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 601 సూర్యఘర్ కనెక్షన్లు ఉన్నాయని.. వీటిని రెండు లక్షలకు చేర్చి పథకం అమల్లో జిల్లాను నెం.1గా నిలపాలని, ఇందులో పొదుపు విలువ, రూపాయి విలువ తెలిసిన స్వయం సహాయక సంఘాల మహిళా శక్తి కీలక భాగస్వామలు కావాలని పిలుపునిచ్చారు. అధికార యంత్రాంగం పరంగా అన్ని విధాలా సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఓ చిన్న మొక్కే మహావృక్షంగా ఎదుగుతుందని.. మీరు వేసే ఓ చిన్న అడుగే సుసంపన్న సమాజ స్థాపనకు దోహదం చేస్తుందన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పొందుతున్న ఎస్‌సీ, ఎస్టీ కుటుంబాలకు సూర్య ఘర్ పథకం కింద ఉచితంగా సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. సొంత ఇల్లు ఉండి, కరెంట్ కనెక్షన్ ఉన్నవారెవరైనా www.pmsuryaghar.gov.in ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని.. సమీప సచివాలయం లేదా విద్యుత్ కార్యాలయం వంటివాటిని సంప్రదించి కూడా వారి సహాయంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు. ప్రతిఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. కార్యక్రమంలో భాగంగా సూర్యఘర్ పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. పీపీటీ ద్వారా పథకం గురించి క్షుణ్నంగా వివరించారు. పథకానికి సంబంధించి మహిళలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కలెక్టర్ లక్ష్మీశ.. బ్యాంకులతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి పథకం ప్రయోజనాలను వివరించే పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రత్యేక కళాకారుల బృందం పథకం ప్రయోజనాలను వివరించడం ఆకట్టుకుంది.
కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.మురళీమోహన్, సూర్యఘర్ నోడల్ అధికారి ఎం.భాస్కర్, లీడ్ బ్యాంక్ యూబీఐ డిప్యూటీ రీజనల్ హెడ్ ఐఎస్ఎస్ మూర్తి, యూసీడీ పీవో వెంకటరత్నం, మెప్మా పీడీ సాయిబాబు, ఎల్‌డీఎం కె.ప్రియాంక, డీపీవో పి.లావణ్య కుమారి, ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ నవీన్, కెనరా బ్యాంకు డివిజనల్ మేనేజర్ వినీత, ఇండియన్ బ్యాంక్ డిప్యూటీ ఆర్ఎం రామారావు, కేడీసీసీ జీఎం రంగబాబు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం బంగార్రాజు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.