-రాష్ట్రంలో ‘గ్రామ ఉజాలా’ పథకం అమలుకు .. కేంద్ర ప్రభుత్వం సన్నధం
-రూ.450 కోట్ల వ్యయంతో ఎల్ఈడీ బల్బులు
-కేంద్ర ప్రభుత్వ సాయంతో ప్రతి ఇంటికీ పంపిణి
-పథకం వ్యయం పూర్తిగా భరించనున్న ఈఈఎస్ఎల్/సీఈఎస్ఎల్
-రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం ఉండదు
-దాదాపు 81.5 లక్షల ఇళ్లకు 4.4 కోట్ల ఎల్ఈడీ బల్బులు అందించనున్న సీఈఎస్ఎల్
-ఊళ్లలో ప్రతి ఇంటికి ఏడాదికి రూ.600-700 తగ్గేందుకు అవకాశమున్న కరెంటు బిల్లులు
-గ్రామ ఉజాలాతో డిస్కంలకు తగ్గనున్న 1144 మెగావాట్ల పీక్ డిమాండ్
-దేశంలో ఈ పథకం అమలు చేయనున్న మూడో రాష్ట్రంగా ఏపీ
-పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన సీఈఎస్ఎల్ ఎండీ మహువా ఆచార్య
-సంక్షేమ కార్యక్రమాల అమలులో ఏపీ చరిత్ర సృష్టించింది: మంత్రి పెద్దిరెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు.. ఇంధన సామర్థ్య కార్యక్రమాలు కేంద్రం దృష్టిని ఆకర్షించాయి. కేంద్ర ప్రభుత్వం గ్రామ ఉజాలా పథకాన్ని అమలు చేయడానికి దేశంలోని ఐదు రాష్ట్రాలను ఎంపిక చేసుకోగా.. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ పథకం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. పథకం అమలుకు ఏపీలో రూ.450 కోట్లు వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్ఎల్ అనుబంధ సంస్థ ‘కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్)’ గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడీ బల్బులను అందజేయనుంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 81 లక్షల కుటుంబాలకు దాదాపు 4 కోట్ల 40 లక్షల ఎల్ఈడీ బల్బులను అందించనుంది. గ్రామ ఉజాలా కార్యక్రమం కింద పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఏపీసీడ్కోల సహకారంతో సీఈఎస్ఎల్ ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు ఈ బల్బుల వల్ల విద్యుత్తు బిల్లులు గణనీయంగా తగ్గనున్నాయి. ఏడాదికి ప్రతి ఇంటికి రూ.600 నుంచి 700 వరకు బిల్లులు తగ్గేందుకు అవకాశముంది. ఈ పథకంతో 1144 మెగావాట్ల పీక్ డిమాండ్ తగ్గనుంది. ఫలితంగా డిస్కంలకు కూడా లబ్ధి చేకూరనుంది.
సీఈఎస్ఎల్ ఎండీ మహువా ఆచార్య రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి ఈ విషయమై చర్చించారు. గ్రామ ఉజాలా కార్యక్రమం ప్రారంభ తేదీ, జిల్లా/వేదికను ఖరారు చేయాలని మంత్రిని కోరారు.
దేశవ్యాప్తంగా సంక్షేమం, ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో చురుగ్గా పనిచేస్తున్న ఐదు రాష్ట్రాలు.. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లలో గ్రామ ఉజాలా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు మహువా తెలిపారు. ఈ పథకాన్ని ఇప్పటికే యూపీ, బిహార్ రాష్ట్రాల్లో ప్రారంభించామని.. ఏపీ మూడో రాష్ట్రమని మంత్రికి తెలియజేశారు.
ఐక్య రాజ్య సమితి (ఐరాస)కు చెందిన క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం (సీడీఎం) ప్రమాణాల మేరకు ఏపీలో గ్రామ ఉజాలా కార్యక్రమం ప్రారంభించడానికి అవసరమైన లాంఛనాలను పూర్తి చేసినట్లు సీఈఎస్ఎల్ ఎండీ తెలిపారు. గ్రామాల్లో నమూనా సర్వే కూడా పూర్తయిందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంట్లో 5 ఐసీఎల్ బల్బులు వినియోగిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. గ్రామ ఉజాలా పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు 7 వాట్, 12 వాట్ ఎల్ఈడీ బల్బులను ఒక్కోటి రూ.10లకు (పనిచేస్తున్న 60 వాట్, 100 వాట్ బల్బులను ఇస్తే) అందజేస్తామని వివరించారు.
గ్రామీణ ప్రజలకు ఎల్ఈడీ బల్బులు అందించే ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏపీని ఎంచుకున్నందుకు సీఈఎస్ఎల్ కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా 5 ఎల్ఈడీ బల్బులు, ఒక్కోటి రూ.10కే అందించడం.. అది కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండానే ఇవ్వడం ముదావహమని చెప్పారు. బహిరంగ మార్కెట్లో 7 వాట్ బల్బు రూ.70, 12 వాట్ బల్బు ధర రూ.120 ఉందని, అలాంటి కేవలం రూ.10లకే బల్బులు అందించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమ అమలుకు ఏపీని ఎంచుకున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రాన్ని మార్చేందుకు తమ ప్రభుత్వం సుస్థిర ప్రయత్నాలు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నట్లు తెలిపారు. సామాజిక, ఆర్థిక స్థితి, రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అత్యుత్తమ సేవలను అందిస్తోందని వివరించారు. గ్రామ ఉజాలా కార్యక్రమాన్ని ఊళ్లలో సమర్థంగా అమలు చేస్తామని, పథకం విజయవంతానికి గ్రామ వలంటీర్ల సేవలు వినియోగించుకుంటామని వెల్లడించారు.
ప్రతి గ్రామాన్ని రోల్ మోడల్ గా నిలిపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి తెలిపారు. గ్రామ వలంటీర్లు వ్యవస్థను నెలకొల్పి లక్షలాది మందికి ఒకేసారి ఉపాధి కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారన్నారు. మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలకు ఇళ్ల వద్దకే సేవలను తీసుకువెళ్తున్నామని చెప్పారు.
గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమలు చేస్తున్నన్ని పథకాలు స్వాతంత్ర్యానంతరం దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయడం లేదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. నాణ్యమైన విద్య, వైద్య, ఆరోగ్య వసతులు, తాగునీరు, వ్యవసాయం, గృహ నిర్మాణం, రహదారులు.. ఇలా గ్రామీణ ప్రజలకు 100 శాతం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. గ్రామీణులు స్వయం సమృద్ధి సాధించాలన్నదే సీఎం లక్ష్యమని చెప్పారు.
ఎల్ఈడీ అత్యధిక ఇంధన సామర్థ్యం కలిగిన లైటింగ్ టెక్నాలజీ అని సీఈఎస్ఎల్ ఎండీ మహువా తెలిపారు. ఇళ్లలో ఎల్ఈడీ లైట్లు కనీసం 75 శాతం తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయని, 25 రెట్లు ఎక్కువ కాలం పనిచేస్తాయని ఆమె వివరించారు. సాధారణ బల్బులతో పోలిస్తే ఎల్ఈడీలతో చాలా తక్కువ వేడి పుడుతుందని చెప్పారు.