విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 62వ డివిజన్ పటేల్ నగర్, లాల్ బహదూర్ శాస్త్రి నగర్, పుచ్చలపల్లి సుందరయ్య హైస్కూల్ పరిసర ప్రాంతాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. జోరువానలోనూ ప్రజల వద్దకు వెళ్లి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రధాన డ్రెయిన్‌లు, కాల్వలను పరిశీలించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వల్లో చెత్త పేరుకుపోయి మురుగు నీరు ఇళ్లల్లోకి చేరేవరకు ఏం చేస్తున్నారని పారిశుద్ధ్య సిబ్బందిని ప్రశ్నించారు. తక్షణమే పూడికను తొలగించాలని ఆదేశించారు. సైడ్ కాల్వలపై శ్లాబులు ఏర్పాటు చేయాలన్నారు. 271 వ వార్డు సచివాలయ ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వచేరకుండా మెరక పోయించాలన్నారు. కమ్యూనిటీ హాల్లోని కళ్యాణ వేదికకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా స్థానిక ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరచడంతో పాటుగా.. పార్కులోని చెత్తను తొలగించి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గడిచిన రెండేళ్లలో డివిజన్ లో రూ. 2 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలియజేశారు. శివారు కాలనీల వరకు అభివృద్ధి పరచడమే తమ ప్రధాన లక్ష్యమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అలంపూరు విజయలక్ష్మీ, నాయకులు అలంపూరు విజయ్ కుమార్, వీరబాబు, బోరా బుజ్జి, రామిరెడ్డి, రెడ్డమ్మ, హైమావతి, సుభా, వీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …