-ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కమ్మ వారందరూ సంఘటితమై సామాజిక సేవలో భాగస్వాములు కావాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఆదివారం గంగూరులో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ కమ్మ వారందరూ సమర్థత, సామర్థ్యం పెంచుకునే దిశగా ముందుకెళ్లాలన్నారు. తను ఏనాడు కులం చూడలేదని సమర్థత, సామర్థ్యంతో మాత్రమే ముందుకెళ్తున్నానని తెలిపారు. ప్రభుత్వాలలో కమ్మవారి బలం తగ్గిపోయిందని విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా బలం పెంచుకోవచ్చాన్నారు. ముఖ్యమంత్రి కమ్మ సామాజిక వర్గం అయినంత మాత్రాన ఆ సామాజిక వర్గానికి ఏది చేయాలంటే అది చేయడం కుదరదన్నారు. కమ్మ సంఘం ద్వారా విద్యా సామాజిక, కార్యక్రమాలను అభివృద్ధి చేసి మానవతా దృక్పథంతో పనిచేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ఆర్ఎస్ఎస్ అనేది బిజెపిలో ఒక కొమ్మ మాత్రమేనని బిజెపి అధికారంలోకి రావడానికి ఆర్ఎస్ఎస్ తోడ్పాటునిచ్చిందని తెలిపారు.
కమ్మ సామాజిక వర్గ మహిళలు సమాజ సేవలో భాగస్వాములు కావడానికి రాజకీయాల్లో రాణించాలన్నారు. గత వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో రాష్ట్రంలో ఏది జరిగినా కమ్మ కులానికి ఆపాదించే వారని రాజకీయాలలో అట్లాంటి నీచ సంస్కృతి పోవాలన్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని ప్రపంచంలోని కమ్మవారంతా ఒకే వేదిక పైకి వచ్చి సంఘటితం కావాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. కమ్మ సేవా సమితి ఆర్గనైజర్స్ కిలారు ఫణి, కార్యదర్శి బోరా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐపీఎస్ ఎ బి వెంకటేశ్వరరావు, తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం, పవర్ మాక్ ఇండస్ట్రీస్ చైర్మన్ సబ్జా కిషోర్, గౌతమ్ విద్యాసంస్థల అధినేత కొసరాజు కోటేశ్వరరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, గన్నీ భాస్కర్, నాగినేని కన్నయ్య, మైనేని సాకేత్, కోనేరు శ్రీధర్, ముత్తవరపు మురళీకృష్ణ, కమ్మ సామాజిక వర్గీయులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News