Breaking News

ప్రజాప్రతినిధి గా ముందుకు సాగడంలో సర్పంచ్ పదవే తొలి మెట్టు…

-సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసే బాధ్యత గ్రామ సర్పంచ్ లదే…
-గ్రామపరిపాలనలో సర్పంచ్ ల పనితీ రే కీలకం…
-రాష్ట్రాన్ని సియం జగన్మోహన రెడ్డి గ్రామస్వరాజ్యం దిశగా నడిపిస్తున్నారు…
-సచివాలయం వ్యవస్థ ద్వారా గ్రామసర్పంచ్ లకు పరిపాలనను సులభతరం చేశారు…
-మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసే గురుతరమైన బాధ్యత సర్పంచ్ పై ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. గ్రామపరిపాలనలో సర్పంచ్ పనితీ రే కీలకం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామసర్పంచ్ లకు గ్రామపంచాయతి పరిపాలన పై శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం సందర్భంగా కృష్ణాజిల్లా గురువారం ఇబ్రహీంపట్నం సమీపంలోని నిమ్రా ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో విజయవాడ డివిజన్ పరిధిలోని గ్రామసర్పంచ్ లకు శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా జాతిపిత మహాత్మాగాంధి భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామపంచాయతి సర్పంచ్ ల శిక్షణా కరదీపికలను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి గ్రామస్వరాజ్యం దిశగా నడిపిస్తున్నారన్నారు. మహాత్మాగాంధి కలలుకన్న గ్రామస్వరాజ్య స్థాపనకోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషి ప్రశంసనీయం అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామసర్పంచ్ లకు పరిపాలనను ముఖ్యమంత్రి మరింత సులభతరం చేశారన్నారు. గ్రామస్థాయి నుంచి పరిపాలన పై అవగాహన ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని ఆదిశగా పాలన పై అవగాహన కోసం సర్పంచ్ లకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవలు అందించేందుకు ప్రతీ ఒక్కరికీ తొలి మెట్టు గ్రామ సర్పంచ్ పదవేనన్నారు. గ్రామసర్పంచ్ గా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నవారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. గ్రామం అభివృద్ధి లో సర్పంచ్ దే కీలకపాత్ర అని అన్నారు. గ్రామస్థాయి నుంచి పరిపాలన పై అవగాహన కలిగినప్పుడే ప్రజలకు మేలు చేసినవారు అవుతారని ఇందుకోసం కల్పించిన శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించే గురుతరమైన బాధ్యత సర్పంచ్ ల పైనే ఉందన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ముందుచూపుతో ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థకు సర్పంచ్ లే రథసారధులు అని ఆయన పేర్కొంటూ మీద్వారా 750 రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించి సంక్షేమ అభివృద్ధిని ప్రజల చెంతకు చేరుస్తున్నామన్నారు. ఈవ్యవస్థలను పర్యవేక్షిస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందేలా చేయవలసిన బాధ్యతను సర్పంచ్ లు చిత్త శుద్ధి తో చేపట్టాలన్నారు. అదేవిధంగా 28 సంక్షేమ పధకాలను అమలు చేస్తు పేదలపాలిట పెన్నిధిగా ముఖ్యమంత్రి నిలుస్తున్నారన్నారు. అర్హులు, అనర్హుల జాబితాలను వేరువేరుగా సచివాలయంలో ప్రదర్శించడమే కాకుండా సోషల్ ఆడిట్ కూడా నిర్వహిస్తూ పారదర్శకంగా కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించాలనే సంకల్పంతోనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. గ్రామాలలో మంచినీరు, పారిశుద్ధ్యం, పచ్చదనం పర్యవేక్షించాలన్నారు. అందుకుగాను ఇటీవలే పంచాయతీరాజ్ చట్టానికి ప్రభుత్వం సవరణలు కూడా చేసిందన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకోసం 15వ ఆర్ధికసంఘం నిధులు కేటాయిస్తున్నామన్నారు. అలాగే ఉపాధిహామి పథకం ద్వారా పేదలకు పనులు కల్పిస్తున్నామన్నారు. అలాగే
గ్రామాలలో కూడా ఆర్థిక వనరులను స్వంతంగా సమకూర్చుకునేందుకు దృష్టి పెట్టాలన్నారు. ఉపాధి హామి పధకం క్రింద గ్రామాల్లో నిర్వహించే పనులపై నిధులు తప్పుదోవపట్టకోకుండా సర్పంచ్ లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామాలలో జగనన్న పచ్చతోరణం పధకం క్రింద గ్రామాలలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకంను ప్రారంభించామన్నారు. కనీసం మీగ్రామాల్లో 83 శాతం నాటిన మొక్కలు బ్రతికేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి రామచంద్రారెడ్డి సూచించారు. విరివిగా మొక్కలు నాటడంతో పాటు నాటిన మొక్కలలో కనీసం 90 శాతం మొక్కలను సంరక్షించే బాధ్యత సర్పంచ్ లు తీసుకోవాలన్నారు. గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం పారిశుద్ధ్యం పై చైతన్యం పెంచేందుకు ఆగష్టు 15 నుంచి 100 రోజులుపాటు జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈకార్యక్రమాన్ని కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ప్రతీ గ్రామంలో నిర్వహించాలన్నారు. కరోనా కష్టకాలం, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను ఏమాత్రం విస్మరించ లేదన్నారు. ఈ రోజు కూడా కాపునేస్తం క్రింద రూ. 490.86 కోట్లను 3,27,244 మంది పేద అక్కాచెల్లెమ్మలకు అందించారన్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన జగనన్న ఇళ్ల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 31.50 లక్షల గృహాలు 17 వేల కాలనీల్లో ఏర్పాటు కాబోతున్నాయన్నారు. ప్రతీ గ్రామంలో యల్ ఇడి లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని వాటిని సచివాలయంలోని ఎనర్జి అసిస్టెంట్ తో నిర్వహించుకోవాలన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో కోవిడ్ – 19 ఎంతో వేధిస్తున్నదన్నారు. ఈ దృష్ట్యా గ్రామాలలో కోవిడ్ నిబంధనలు టించడంపై ప్రజల్లో సర్పంచ్ అవగాహన కల్పించవలసిన బాధ్యత తీసుకోవాలన్నారు.

జిల్లా కలెక్టరు జె. నివాస్ మాట్లాడుతూ జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో 4 దశలుగా 178 గ్రామసర్పంచ్ లకు మూడేసి రోజులుపాటు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్యం కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయడంతో పాటు మౌలికవసతుల కల్పనలో గ్రామసర్పంచ్ లకు తోడ్పాటును అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. గ్రామపంచాయతి పాలన పై నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమంలో 14 అంశాలలో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా గ్రామాల్లో కోవిడ్ మేనేజ్ మెంట్ కమిటీలు సర్పంచ్ ఆధ్వర్యంలో ఉన్నందున ఆయా గ్రామాల్లో కోవిడ్ నియంత్రణలో వారి బాధ్యత ఎంతో ఉందన్నారు.

ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ గాంధీజీ కన్న కలలు ఫలించాలని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి గ్రామపంచాయతీలను అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం సర్పంచ్ ద్వారానే ప్రజలకు చేరువ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా కష్టకాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా ఇబ్బందులను ఎ దుర్కున్నదన్నారు. అయినా కానీ నిరంతర అభివృద్ధి సంక్షేమ పధకాలను నిరంతరం అమలు చేస్తూ ముఖ్యమంత్రి ప్రజలకు అండగా ఉన్నారన్నారు. దేశంలో ఏరాష్ట్రంలోనూ అమలు చేయనన్ని సంక్షేమ పధకాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్న తరుణంలో సర్పంచ్ లుగా పదవిని అలంకరించడం అదృష్టంగా భావించాలన్నారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజలవద్ద కే పాలన తీసుకురావడం అయ్యిందన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి అవగాహన కలిగి పారదర్శకంగా వాటిని అమలు చేయడంలో కృతనిశ్చయులు కావాలని ఆయన కోరారు.

మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎదిగిన నాయకులను నేటితరం సర్పంచ్ లు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పధకాల అమలు బాధ్యత గ్రామసర్పంచ్ లదే అన్నారు. వర్షాకాలం, వేసవికాలం వంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా గ్రామాలలో ఆయా కార్యక్రమాలు చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.

గ్రామీణాభివృద్ధి శాఖ యస్.ఐ.ఆర్.డి. డైరెక్టరు జె. మురళీ మాట్లాడుతూ రాష్ట్రంలో 13377 గ్రామపంచాయతీలు ఉండగా ఎన్నికలు జరగని 276 గ్రామపంచాయతీలు మినహాయించి 13,095 గ్రామసర్పంచ్ లకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. వీటిలో 4 వేల పైబడి జనాభా కలిగిన 2,100 గ్రామాలను గుర్తించి ఆసర్పంచ్ లకు బాపట్ల, సామర్లకోట, శ్రీకాళహస్తిలలోని ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈశిక్షణా కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం 3.48 కోట్లు కేటాయించి 300 మంది మాస్టర్ ట్రైనీలను ఆయా జిల్లాల్లో శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్తు సిఇఓ సూర్యప్రకాష్, డిపిఓ జ్యోతి, తహశీల్దారు సూర్యారావు, డివిజినల్ పంచాయతి అధికారి చంద్రశేఖర్, విజయవాడ డివిజన్ పరిధిలోని పలువురు గ్రామసర్పంచ్లు పాల్గొన్నారు.

Check Also

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *