Breaking News

ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తూట్లు

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యభద్రతకు తూట్లు పొడుస్తోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. అదే వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య అవ‌స‌రాలు తీర్చడమే లక్ష్యంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. దేశమంతా కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు పడుతుంటే… ఏపీ ప్రజలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు. ప్రజల ఆరోగ్యానికి పూర్తిస్థాయి భరోసాని కల్పిస్తూ.. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, 108, 104 సర్వీసుల పెంపు, ఆరోగ్య ఆసరా వంటి కార్యక్రమాల ద్వారా నాణ్యమైన వైద్యాన్ని అందించినట్లు చెప్పారు. వైఎస్సార్ మానసపుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లను ఏకంగా 3,257కి పెంచి.. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచిత చికిత్స కోసం రూ.13,471 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. శస్త్ర చికిత్సలు జరిగిన 24.59 లక్షల మందికి కోలుకునే సమయంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్ల మేర సాయం అందించినట్లు వివరించారు. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షలు నుంచి రూ. 25 లక్షలకు పెంచడం చారిత్రాత్మకమన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కోటిన్నర కుటుంబాలకు ఆపద్భాంధవి అయిన ఆరోగ్యశ్రీ పథకానికి వెచ్చిస్తున్న మొత్తంలో కోత విధించడానికి.. బీమా పద్ధతిలో పథకాన్ని అమలు చేసేందుకు చూస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య సేవలను ట్రస్ట్‌ పద్ధతిలో కాకుండా ఇన్సూరెన్స్‌ విధానంలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
పేదలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా నెట్ వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో కూటమి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మల్లాది విష్ణు ఆరోపించారు. 2019 లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న పెండింగ్ బిల్లులన్నింటినీ అప్పటి ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు. కానీ కూటమి ప్రభుత్వం నేడు బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫలితంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది నిరుపేదలకు పునర్జన్మను ప్రసాదించిన నెట్ వర్క్ ఆస్పత్రులు నేడు జీవశ్చవాలుగా మారాయని పేర్కొన్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను తేవాలన్న సంకల్పంతో రూ.8,500 కోట్లతో 17 కొత్త మెడికల్‌ కాలేజీలకు శ్రీకారం చుట్టగా.. వైఎస్ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందన్న దుగ్దతో మెడికల్‌ కాలేజీలను అమ్మేస్తూ నిరుపేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో..
ఎన్టీఆర్ జిల్లాలో 93 ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు ఉండగా.. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లా వ్యాప్తంగా 1,93,796 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.443.90 కోట్ల విలువైన వైద్య సేవలు అందించినట్లు మల్లాది విష్ణు చెప్పారు. విజయవాడ నగరంలో 83,045 మందికి అక్షరాల రూ. 183.28 కోట్ల విలువైన వైద్య సేవలు పూర్తి ఉచితంగా అందించినట్లు వెల్లడించారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్ పరిధిలో 2,243 మందికి 12 కోట్ల ఒక లక్షా 46 వేల 91 రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయగా.. 211 మందికి 3 కోట్ల 41 లక్షల 56 వేల 720 రూపాయలకు సంబంధించి ఎల్ఓసి పత్రాలను అందించినట్లు చెప్పారు. మొత్తంగా రూ. 15 కోట్ల 77 లక్షల 87 వేల 811 లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. అదేవిధంగా పేదలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నియోజకవర్గ పరిధిలో 4 నూతన అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించుకున్నట్లు తెలిపారు. వీటిలో 60 రకాల టెస్టులతో పాటు 172 రకాల మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ప్రతి ఇంటిని జల్లెడపడుతూ చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను నియోజకవర్గంలో 52,519 మంది సద్వినియోగపరచుకున్నట్లు వెల్లడించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని మల్లాది విష్ణు ఆరోపించారు. స్పెషలిస్టు వైద్యులు సహా సిబ్బంది నియామకాలు నిలిపివేసి.. పేదల జేబులకు కూటమి సర్కారు చిల్లులు పెడుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా జీజీహెచ్ లో పరిస్థితి మరీ దయనీయంగా మారిందని.. బ్లడ్ టెస్టులు, మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జీజీహెచ్ లో పారిశుద్ధ్యం మరీ అధ్వాన్నంగా తయారైందని మండిపడ్డారు. తమ హయాంలో మూడు పూట్ల శానిటేషన్ పనులు జరిగేవని.. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క పూట చేయడమే గగనంగా మారిపోయిందని ఆరోపించారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి బాధ్యత తీసుకోవాలని మల్లాది విష్ణు కోరారు. వైద్య సేవలను ఇన్సూరెన్స్‌ విధానంలో కాకుండా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ పద్ధతిలోనే కొనసాగించవలసిందిగా సూచించారు. అలాగే నెట్ వర్క్ ఆస్పత్రులకు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *