-స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూల మాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించిన 20 సూత్రాల ప్రోగ్రాం చైర్ పర్సన్ దినకర్ లంకా, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య సమర యోధులు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన తొలి అధికారిక కార్యక్రమంలో వారి చిత్రపటానికి శనివారం ఉదయం గౌ. 20 సూత్రాల ప్రోగ్రాం చైర్ పర్సన్ దినకర్ లంకా, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ లు సంయుక్తంగా పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డె ఓబన్న 11 జనవరి 1807న నంద్యాల జిల్లా, సంజామల మండలంలోని నొస్సం గ్రామంలో నివసిస్తున్న వడ్డె సుబ్బన్న మరియు సుబ్బమ్మ దంపతులకు జన్మించారని తెలిపారు. వడ్డె ఓబన్న గ్రామ రక్షకునిగా పని చేసేవారని అయితే, బ్రిటీష్ పాలనతో గ్రామ రక్షకుల జీతాలు రద్దు చేయబడిన తరువాత రైతులపై అధిక పన్నులు విధించడం ప్రారంభం కావడంతో వడ్డె ఓబన్న బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం చేసిన పోరాటంలో తన వంతు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రజలలో ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడిగా, సామాన్యుల హక్కుల కోసం చేసిన పోరాటంలో నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు. వడ్డె ఓబన్న చేసిన త్యాగాలు, ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన జయంతి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఇతర సాహసికులు, స్వాతంత్య్ర యోధుల పోరాటాల ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుందని అన్నారు. ఆయన త్యాగాలను, సమాజం కోసం ఆయన చేసిన సేవలను గుర్తించుకోవడం కోసం ప్రతీ సంవత్సరం జనవరి 11న “శ్రీ వడ్డె ఓబన్న జయంతి” ని అధికారికంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార అధికారి చంద్రశేఖర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, వివిధ సంఘాల బీసీ నాయకులు, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.