-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న పోరాటం చిరస్మరణీయమని, భావితరాలకు స్ఫూర్తి మార్గమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శనివారం వడ్డె ఓబన్న జయంతి సందర్బంగా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ లక్ష్మీశ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం, ప్రజా ప్రయోజనాల కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఓబన్న పోరాటానికి సముచిత గుర్తింపునిచ్చి, ఆయన స్ఫూర్తిని ముందుతరాలకు అందించాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వడ్డె ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వడ్డె ఓబన్న పేద రైతులు, గ్రామస్థుల హక్కులు కాపాడేందుకు, వారికి న్యాయం చేసేందుకు బ్రిటిష్ వారిపై పోరాటం చేశారన్నారు. ఓబన్న త్యాగాలను, సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తుంచుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని.. ఆయన అందించిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, రాష్ట్రం, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, ఇన్‌ఛార్జ్ బీసీ సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.