– నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు
– ప్రత్యేక బృందాలతో ముమ్మర తనిఖీలు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆహార ఉత్పత్తుల ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిందేనని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఉత్పత్తులు అత్యంత నాణ్యంగా ఉండేలా చూసుకోవాల్సిందేనన్నారు. పండగ వేళ ఆహార భద్రత అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. తనిఖీల్లో సేకరించిన నమూనాల్లో ఏమైనా కల్తీగానీ, నాణ్యతాలోపంగానీ ఉంటే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం – 2006 పటిష్ట అమలుకు వివిధ శాఖల సమన్వయంతో కృషిచేయడం జరుగుతుందన్నారు.
ఆహార భద్రత కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు.. శనివారం విజయవాడలోని వివిధ స్వీట్‌షాపులు, బేకరీల్లో తనిఖీలు నిర్వహించినట్లు జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు తెలిపారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి నమూనాలు సేకరించామని, వీటిని ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆహార భద్రత, ప్రమాణాల చట్టం – 2006లోని సెక్షన్-32 మేరకు వివిధ ఉత్పత్తులకు సంబంధించి కొల్లిస్ ఎంటర్‌ప్రైజెస్ (ఆటోనగర్), శ్రీ విజయ ట్రేడర్స్ స్వగృహ ఫుడ్స్ ( పున్నమ్మతోట), నవరంగ్ బేకరీ (గవర్నర్‌పేట), కాజూ హౌస్ (ఆటోనగర్), శ్రీ సాయిబాబా ఘీ స్వాట్స్ అండ్ హోమ్ ఫుడ్స్ (ఆటోనగర్)లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ తనిఖీలు ఇకపైనా కొనసాగుతాయని ఆయన తెలిపారు.