విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., నేతృత్వంలో శనివారం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి సిటీ ఆర్మడ్ రిజర్వు పోలీస్ గ్రౌండ్ నందు సంక్రాంతి పండుగ సంబరాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ పేరేడ్ మైదానం నందు బోగిమంటలు, గంగిరెద్దులు, ముత్యాల గొబ్బెమ్మలు, ముగ్గుల రంగవల్లులతో గ్రామం లాగా తయారై కర్రసాము, వివిధ సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
ఈ నేపధ్యంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., మాట్లాడుతూ…. ఈరోజు పోలీస్ మైదానాన్ని చూస్తే సంక్రాంతి సంబరాలకు ఒక గ్రామానికి వచ్చినట్లు అనిపిస్తుందని ఎటు చూసినా బోగిమంటలు, గంగిరెద్దులు, ముత్యాల గొబ్బెమ్మలు, ముగ్గుల రంగవల్లులు, సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతి ఒక్కరు భేదాభిప్రాయం లేకుండా మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలనే సూక్తితో కల్మషం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా జీవనాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ఈ రోజు ఈ విధంగా మీ అందరితో కలిసి గడపడం చాలా సంతోషంగా వుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలను తెలియజేసారు.
ఈ క్రమంలో ట్రాఫిక్ లో హెల్మెట్ వాడకంపై నగరంలో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో హెల్మెట్ పై అవగాహన బాగా పెరిగింది. మీడియా కదనాలు కూడా ప్రజల్లో బాగా చైతన్యం తీసుకొచ్చాయి. బెంజ్ సర్కిల్ వద్ద డ్రోన్ ఏ.ఐ.టూల్ ను ఉపయోగించి 17 నిమిషాల పాటు పరిశీలించగా మొత్తం 1193 మోటార్ వాహనాలు బెంజ్ సర్కిల్ మీదుగా ప్రయాణించగా వాటిల్లో హెల్మెట్ పెట్టుకొని 1004 మంది ప్రయాణించారు. యావరేజ్ గా 84.2 శాతం మంది హెల్మెట్ పై అవగాహన కలిగి హెల్మెట్ ధరించి ప్రయాణించడం జరిగింది.
నిన్న కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. సంక్రాంతి పండుగనుంచి అయినా అందరూ పూర్తిగా హెల్మెట్ వాడాలని కోరుకుంటున్నాను. ప్రమాదంలో మరణాల సంఖ్య తగ్గించాలనేది మా లక్ష్యం. మీ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకొని నిబంధనలో పాటించండి. డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్రమబద్దీకరణ చేస్తున్నాము. పోలీస్ సిబ్బంది అందరికీ హెల్మెట్ వాడాలని తెలియజేశాం. ఎవరైనా వాడకపోతే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారు కూడా బాధ్యత హెల్మెట్లు వాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సందర్భంగానే మీడియా ప్రదినిధులకు హెల్మెట్ లను ఇవ్వడం జరిగింది. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరణ చేస్తున్నాము పండుగ పేరుతో బెట్టింగులు కోడిపందాలు ఆడకండి. ఇటీవల చాలా కోడిపందాల బరులను పూర్తిగా తొలగించడం జరిగింది. సంక్రాంతిని సరదాగా జరుపుకోండి, బెట్టింగులు కోడిపందాలు ఆడకుండా సాంప్రదాయ క్రీడలను ఆడుతూ ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించండి అని తెలియజేశారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించి పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.,తోపాటు, డి.సి.పి.లు గౌతమీ షాలి ఐ.పి.ఎస్., తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్, కృష్ణ మూర్తి నాయుడు, ఎస్.వి.డి.ప్రసాద్, ట్రైనీ ఐ.పి.ఎస్.మనిషా, ఏ.డి.సి.పి.లు ఎ.వి.ఎల్.ప్రసన్న కుమార్, ఎం.రాజరావు, కె.కోటేశ్వర రావు, ఎ.ఆర్. ఎ.సి.పి డి.ప్రసాద రావు, ఏ.సి.పి.లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐ.లు, అధికారులు మరియు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.