Breaking News

ఎపీకి ఇచ్చిన నిధుల వివరాలతో అమిత్‌షా శ్వేతపత్రం విడుదల చేయాలి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత 6 నెలల కాలంలో ఎపీకి రూ.3 లక్షల కోట్లు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.
ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఎపీకి గత 6 నెలల కాలంలో రూ.3 లక్షల కోట్లు సహాయం చేసిందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అబద్ధాలు చెప్పడం తగదు. రూ.3 లక్షల కోట్లు దేనికోసం, ఎందుకోసం కేటాయించారో వివరాలను తెలిపితే బాగుండేది. ప్రజలను మభ్యపెట్టడానికి అమిత్‌ షా అబద్ధాలు వల్లెవేస్తున్నారు. గతంలో ఎపీలో జరగని అభివృద్ధి, ఇప్పుడు జరిగిందంటూ చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి? గత 5 ఏళ్లలో కూడా కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎపీ అభివృద్ధికి ఎందుకు సహకరించలేకపోయారు? 2014`19 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు 4 ఏళ్లపాటు కేంద్రంలో మీకు అనుకూలంగానే ఉన్నారు. 2019`24 వరకు అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పూర్తిస్థాయిలో కేంద్రంలో బిజెపికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచారు. పార్లమెంటులో కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలకు బేషరతుగా వైసిపి మద్దతు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఎపీలో జగన్మోహన్‌రెడ్డికి పూర్తిగా సహకరించి, ఇప్పుడు ఆ కాలంలో అభివృద్ధి జరగలేదని చెప్పడాన్ని అవకాశవాదం కాక మరేమనాలి? ఇవి పచ్చి అబద్ధాలు కావా?
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఇచ్చిన ప్యాకేజీని స్వాగతిస్తూ, ప్రైవేటీకరణ కాకుండా పూర్తిస్థాయిలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అభివృద్ధి చెందాలంటే సెయిల్‌లో విలీనం చేసి, సొంత గనులు కేటాయించాలని స్టీల్‌ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు ద్వారా అమరావతి రాజధానికి రూ.15 వేల కోట్లు రుణంగా ఇప్పించి, అది కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చినట్లు చెప్పుకోవడంలో ఆంతర్యంమేంటి?
అవాస్తవాలను, అబద్ధాలను వల్లెవేస్తున్న అమిత్‌ షాకు చిత్తశుద్ధి ఉంటే గత 6 మాసాల కాలంలో ఎపీకి రూ.3 లక్షల కోట్లు దేనికోసం ఇచ్చారో సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *