Breaking News

ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకునే పంట ఆయిల్ పామ్

-సాగు పట్ల రైతులకు అవగాహన కార్యక్రమాలు
-జిల్లా కలెక్టర్

మొవ్వ/పమిడిముక్కల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకుని రైతులకు లాభాలను ఇచ్చే పంట ఆయిల్ పామ్ సాగు అని, ఆ సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన స్థానిక శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజాతో కలిసి పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ, పమిడిముక్కల మండలాల్లో పర్యటించి ఆయిల్ పామ్ మొక్కల నర్సరీ, పంట సాగును క్షేత్రస్థాయిలో సందర్శించారు. మొవ్వ మండలములోని కొండవరం గ్రామంలో కొసరాజు వెంకటలక్ష్మి దాసు అనే రైతు 13 ఎకరాలలో సాగుచేసిన ఆయిల్ పామ్ సాగు పంటను, అదేవిధంగా సాగులో అంతరపంటగా వేసిన మినుము పంటను ఆసక్తిగా పరిశీలించారు. సాగుకు సంబంధించిన వివరాలను రైతుతో పాటు అధికారులు, కంపెనీ ప్రతినిధుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పమిడిముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందగలిగే ఆయిల్ పామ్ సాగు పట్ల మొగ్గు రైతులను ప్రోత్సహించాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఇటీవల జిల్లాలో కురిసిన అధిక వర్షాలు, సంభవించిన వరదలకు పామాయిల్ సాగు తట్టుకొని నిలబడిందని దీనిని రైతులు గమనించాలన్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తిగల రైతులను ఆయిల్ పామ్ సాగు క్షేత్రాలకు తీసుకువెళ్లి అందు లాభాలను, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వివరించి సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకు హెక్టారుకు 143 మొక్కలను వంద శాతం సబ్సిడీతో ఉచితంగా అందిస్తామన్నారు. సాధారణంగా ఒక్కొక్క మొక్క ధర రూ.193 ఉంటుందని, రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయి సబ్సిడీతో ఉచితంగా మొక్కలను అందిస్తుందన్నారు. అదేవిధంగా బిందు సేద్యం పద్ధతిపై సాగు చేపట్టే రైతులకు 50 శాతం రాయితీతో డ్రిప్పర్స్, జెట్ పరికరాలను అందిస్తామని అన్నారు.

పంట అయిదవ సంవత్సరం నుంచి చేతికి వస్తుందని, ఆ లోపుగా మొదటి నాలుగు సంవత్సరాల వరకు మొక్కలకు ఎరువుల యాజమాన్యం, అంతర పంటల సాగు నిమిత్తం సంవత్సరానికి ఒక హెక్టారుకు రూ.5,625లను రైతులకు అందించడం జరుగుతుందన్నారు. ఒకసారి నాటిన మొక్కలతో 30 సంవత్సరాల వరకు నిరంతర ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ఆయిల్ పామ్ కు మార్కెట్లో పెద్ద మొత్తంలో డిమాండు ఉందని, రైతుల పండించిన పంటను అమ్ముకోవడానికి శ్రమ పడనవసరం లేదని, నేరుగా సంబంధిత కంపెనీలు రైతు వద్దకు వచ్చి చట్టం ప్రకారం తెలిపిన మద్దతు ధరకే కొనుగోలు చేస్తారని తెలిపారు.

శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు చేసిన రైతుకు ఒక భరోసా, ధైర్యాన్ని ఇస్తుందని, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు. పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కల గ్రామంలో 3ఎఫ్ కంపెనీ వారు ఆయిల్ పామ్ కు సంబంధించి నర్సరీ ఏర్పాటు చేసిందని, త్వరలో వారు పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమైనట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే 200 ఎకరాల్లో పంట సాగు అవుతోందని, రానున్న రోజుల్లో ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగయ్యే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో 3ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ పాచర్ల విజయ ప్రసాద్, ఉద్యాన శాఖ అధికారిణి జె జ్యోతి, ఏపీ మైక్రో ఇరిగేషన్ పీడీ విజయలక్ష్మి, పమిడిముక్కల గ్రామ సర్పంచ్ ముళ్ళపూడి సునీత, ఉద్యానవన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *