-మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన
-ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
ఏలూరు/ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.సోమవారం నూజివీడు నియోజకవర్గ పరిధిలోని యువతి యువకులకు అమరరాజా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆగిరిపల్లి సమీపంలోని గోపాలపురం ఎన్ ఆర్ ఐ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర మంత్రి పార్థసారథి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధుల వద్దకే వచ్చి ప్రముఖ సంస్థలు, కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే జాబ్ మేళా ఒక గొప్ప అవకాశమని, దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీ పై ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించిన తల్లిదండ్రులకు, ఎంతో కష్టపడి మీరు చదివిన చదువుకు తగిన జాబ్ లభించినప్పుడే విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరింత గౌరవం, తృప్తి కలుగుతుందని పేర్కొన్నారు. చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా కళాశాలల్లోనే జాబ్ మేళాలు నిర్వహించి పలు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా కృషిచేస్తున్నమన్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వస్తుందన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అభివృద్ధి పనుల ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అనువైన పరిస్థితులు ఉండటం,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చొరవతో పెద్ద ఎత్తున వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, లక్షలాది మందికి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు లభించునున్నాయన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వెంకటరావు,ఇతర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.