గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు తీసుకోవాలని, మైక్రో పాయింట్స్ వారీగా పిన్ పాయింట్ ప్రోగ్రాం మేరకు పారిశుధ్య పనులు జరిగేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ నాజ్ సెంటర్ రిజర్వాయర్ లోని మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ చేసి, కార్మికులు, కార్యదర్శుల హాజరు రిజిస్టర్లను పరిశీలించి, మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడానికి తగిన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికుల హాజరును సచివాలయ శానిటేషన్ కార్యదర్శులే తీసుకోవాలన్నారు. కార్మికులు అత్యవసరమైతే తప్ప సెలవులకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, కార్యదర్శులు విధులకు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. సచివాలయాల వారీగా సెలవుల రిజిస్టర్ మెయిన్టైన్ చేయాలన్నారు. శానిటేషన్ డివిజన్ల వారీగా పారిశుధ్య పనులకు అవసరమైన పుష్ కాట్స్, డంపర్ బిన్లను ఎప్పటికప్పుడు మరమత్తులు చేయించి, కార్మికులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. అనంతరం కావేరి నగర్, నగరంపాలెం దర్గా వెనుక రోడ్, ఐపిడి కాలనీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి, నూతన రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు డ్రైన్ టు డ్రైన్ ఉండేలా, డ్రైన్ల నిర్మాణం చేసిన తర్వాతనే రోడ్ల నిర్మాణం చేసేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతనంగా నిర్మాణం చేసిన డ్రైన్లలో మురుగుపారుదల సక్రమంగా ఉండడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, నిర్మాణ సమయంలో లెవల్స్ పాటించాలని ఎమినిటి కార్యదర్శులను ఆదేశించారు. నల్లచెరువు మెయిన్ రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ఆహార పదార్ధాల నాణ్యత, శుభ్రతపై ప్రజలను వివరాలు అడిగి తెలుసుకొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రూ.5కే ఆహారం అందించాలని అన్న క్యాంటీన్లను ప్రారంభించిందని, సిబ్బంది క్యాంటీన్ కి వచ్చే ప్రజలపట్ల మర్యాదగా వ్యవహరిస్తూ భోజనం అందించాలని ఆదేశించారు. ప్రతి రోజు వస్తున్న ప్రజల సంఖ్యను అనుసరించి, అవసరమైతే ఇండెంట్ పెంచుకోవాలన్నారు.
పర్యటనలో డిఈఈ మధుసూదనరావు, ఆర్ఓ మదన్ గోపాల్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
