గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు ప్రారంభానికి ముందే నగరంలోని ప్రధాన రహదారులను ట్రాఫిక్ రద్దీకి తగిన విధంగా సిద్దం చేసుకోవాలని, ట్రాఫిక్, రైల్వే, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంభర్ లో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ శానసభ్యులు నసీర్ అహ్మద్, గల్లా మాధవి , జిఎంసి, రైల్వే, ఆర్&బి, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సంయుక్త సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆర్ఓబి నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్ విస్తరణ పనులు ప్రారంభించామని, ఇప్పటికే ప్రభావిత భవన యజమానులకు నోటీసులు ఇచ్చి, అంగీకారం తెలిపిన భవనాలను తొలగిస్తున్నామన్నారు. ఆర్ఓబి పనులు ప్రారంభమైతే గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ప్రధాన రహదారులను సిద్దం చేసుకోవల్సి ఉంటుందన్నారు. ప్రధానంగా 3 వంతెనల వద్ద మరొక వెంట్ ఏర్పాటు చేసి, రోడ్ వెడల్పు చేయడానికి రైల్వే అధికారులు పరిశీలించాలని, తద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చన్నారు. అలాగే శంకర్ విలాస్ సెంటర్ నుండి అమరావితి రోడ్ లోని ఇన్నర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు, బ్రాడీపేట, అరండల్ పేటల్లో రోడ్ల ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
తూర్పు నియోజకవర్గ శానసభ్యులు నసీర్ మాట్లాడుతూ నగరానికి కీలకమైన ఆర్ఓబి పనులు జరిగే క్రమంలో అన్ని శాఖలను, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేకంగా సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నియమించడానికి పరిశీలించాలని కోరారు. నిర్మాణ పనుల వలన జిజిహెచ్, రైల్వే స్టేషన్ కు వచ్చే వేల మంది ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను త్వరగా సిద్దం చేసుకోవాలన్నారు. అరండల్ పేట, బ్రాడీపేట 1వ లైన్లను విస్తరణ చేయడానికి రైల్వే, జిఎంసి సంయుక్తంగా కృషి చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.
పశ్చిమ నియోజకవర్గ శానసభ్యులు మాధవి మాట్లాడుతూ బ్రాడిపేట 14వ అడ్డరోడ్ లోని రైల్వే గేటుని ఆర్ఓబి నిర్మాణ పనులు జరిగే కాలంలో రాకపోకలకు అవకాశాన్ని రైల్వే అధికారులు కల్పించడానికి చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ సమస్య కొంత మేర తగ్గుతుందన్నారు. అలాగే ప్రధాన రహదారుల్లో ఆక్రమణలను తొలగించాలని, ముందుగా ఫుడ్ కోర్ట్ లేదా వెండింగ్ జోన్లను కేటాయించాలని సూచించారు. జిజిహెచ్ కి నిత్యం ఎమర్జన్సీ అంబులెన్స్ వస్తుంటాయని, అందుకు తగిన విధంగా ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్దం చేసుకోవాలని తెలిపారు.
సమావేశంలో రైల్వే ఏఓఎం ముఖేష్ కుమార్, డిఈఎన్ భరత్ కుమార్, జిఎంసి ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఆర్&బి ఈఈ విశ్వనాధరెడ్డి, డిఈఈ చిన్నయ్య, ట్రాఫిక్ సిఐలు అశోక్ కుమార్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
