-తరతరాల మానవ జాతికి స్ఫూర్తిదాయకం
-వామపక్ష భావజాలం విస్తృతం
-లెనిన్ శత వర్థంతి ముగింపులో వక్తలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గానికి, ప్రజానీకానికి లెనినిజం అజేయంగా నిలిచిందని, పెట్టుబడిదారీ వ్యవస్థ, దోపిడీ దారులకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలకు సోషలిస్టు రాజ్యనిర్మాత విఐ లెనిన్ ఒక స్ఫూర్తిదాయకమని వక్తలు ఉద్ఘాటించారు. ప్రపంచ ప్రప్రథమ సోషలిస్టు రాజ్య నిర్మాత, విప్లవ యోధుడు కామ్రేడ్ విఐ లెనిన్ శత వర్థంతి ముగింపు (101) సందర్భంగా మంగళవారం విజయవాడ లెనిన్ సెంటరులోని లెనిన్ విగ్రహానికి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు నివాళులర్పించారు. అనంతరం కార్ల్ మార్క్స్`ఎంగెల్స్`లెనిన్ విగ్రహాల కమిటీ కన్వీనర్ బుడ్డిగ జమీందార్ అధ్యక్షతన సభ జరిగింది.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, లెనిన్ శత జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా అనేక సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయన్నారు. తరతరాల మానవ జాతికి లెనిన్ స్ఫూర్తిదాయకమని చెప్పారు. సామ్రాజ్యవాదం యుద్దాలకు మూలమని, ఆ సామ్రాజ్యవాదాన్ని అంతం చేయకుండా శాంతిని నెలకొల్పలేరని, పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజాస్వామ్యానికి మనుగడలేదని లెనిన్ చెప్పారని గుర్తుచేశారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ, నేటి రాజకీయ పరిస్థితుల్లో దేశంలోని మతోన్మాదం, ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. మతవాద, మితవాద శక్తులను ఎదుర్కొవాలంటే సైద్ధాంతికంగా, వామపక్ష భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలగాలని, అప్పుడే దేశంలోని రాజకీయ వ్యవస్థను మార్చడానికి దోహదపడుతుందన్నారు. ఆ రూపంలో ఉన్న ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులు ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ప్రపంచ శాంతి ఉంటేనే మానవ జీవితం మనుగడ సాగుతుందని స్పష్టంచేశారు. లెనిన్ స్ఫూర్తితో వామపక్షాలు బలపడాల్సిన అవసరముందని, ఆ దిశగా మనమంతా ప్రయాణించాలని, కామ్రేడ్ లెనిన్‌కు సీపీఐ తరపున నివాళులర్పించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు నరసింహారావు మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గానికి, ప్రజానీకానికి లెనినిజం అజేయంగా నిలిచిందని అన్నారు. ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా నిలిచిన రాజ్యాంగ హక్కులను మనమంతా కాపాడుకుంటేనే..కార్మిక వర్గానికి విముక్తి కలుగుతుంని, పోరాటాలకు సాధ్యమవుతుందని చెప్పారు.
ఎస్‌యూసీఐ నాయకులు అమర్‌నాథ్ మాట్లాడుతూ, నేడు ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పరిష్కారానికి లెనినిజమ్, మార్క్సిజమ్‌తోనే సాధ్యమని స్పష్టంచేశారు. ప్రజాసాహితి నుంచి దివికుమార్, సీపీఐ(ఎంఎల్) ముప్పాళ్ల భార్గవశ్రీ, ఇప్ట్యూ రాష్ట్ర కార్యదర్శి పోలారి తదితరులు మాట్లాడుతూ, గత శతాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు, అనేక దేశాల స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని..స్వాతంత్య్రం సిద్ధించడానికి తోడ్పడ్డాయని చెప్పారు. మార్క్సిజం, లెనినిజం మనకు ఉద్యమ మార్గదర్శకాలను చూపిందన్నారు. పెట్టుబడిదారీవర్గం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, నియంతృత్వాన్ని ప్రజలపై రుద్దుతోందని, ఆయన చెప్పిన మాట..ఈ రోజు అక్షర సత్యాలుగా మనముందు కన్పిస్తున్నాయన్నారు. కార్పొరేట్ ఆదిపత్యంలోని మతోన్మాద శక్తుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడటానికి మనమంతా లెనిన్ స్ఫూర్తితో ముందుకు రావాలన్నారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ, లెనిన్ శత వర్థంతి సందర్భంగా గత సంవత్సర కాలం నుంచి అనేక కార్యక్రమాల్ని నిర్వహించామని గుర్తుచేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థ, దోపిడీ దారులకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలకు లెనిన్ ఒక స్ఫూర్తిదాయకమని, అదే ఆ స్ఫూర్తితో ఎర్ర జెండాను ముందుకు తీసుకెళ్లేందుకు మనమంతా పునరంకితం కావాలన్నారు. బుడ్డిగ జమీందార్ మాట్లాడుతూ, విజయవాడ నగరంలో విగ్రహాలు ఉండటం దేశంలోనే ఒక పెద్ద గర్వకారణంగా భావిస్తున్నామని చెప్పారు. అప్పటి సీపీఐ, సీపీఎం అగ్రనాయకత్వం, సోవియట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ విఎస్ షివ్ చెంకో సమక్షంలో పెద్దలు చుక్కపల్లి పిచ్చయ్య, టి.వెంకటేశ్వరరావు, వామపక్ష పార్టీల సహకారంతో విజయవాడలో విగ్రహాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. లెనిన్ శతవర్థంతి సందర్భంగా అనేక ఏడాది నుంచి అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని వివరించారు. అనేక సదస్సులు నిర్వహించామని, వామపక్ష ఉద్యమాలకు పురిటిగడ్డగా ఉన్న విజయవాడలో ఈ తరహా కార్యక్రమాల్ని నిర్వహించడం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాలకే ఒక స్ఫూర్తిదాయకమని చెప్పారు. తొలుత ఆంధ్రా ప్రజానాట్యమండలి రాష్ట్ర కోశాధికారి ఆర్.పిచ్చయ్య, నాయకులు నజీర్ విప్లవ గీతాలను ఆలపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, వై.వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు దడాల సుబ్బారావు, దోనేపూడి కాశీనాథ్, డీవీ కృష్ణ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం.రామకృష్ణ, రాఘవాచారి ట్రస్ట్ నుంచి అక్కినేని చంద్రారావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.చెంచయ్య, విజయవాడ నగర సీపీఐ సహాయ కార్యదర్శి లంకా దుర్గారావు, నక్కా వీరభద్రరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రసాద్, ఇన్షాఫ్ రాష్ట్ర నాయకులు అప్షర్, శ్రీశ్రీ ప్రింటర్స్ నుంచి విశ్వేశ్వరరావు, డాక్టర్ వి.రామ్‌ప్రసాద్, డాక్టర్ సుజాత, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను, ప్రజా సంఘాల నాయకులు మోతుకూరి వెంకటేశ్వరరావు, జి.వలరాజు, సాయికుమార్ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.