విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణం వెనుక భాగాన ఉన్న వీరబాబు స్వామి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు జరిగాయి. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కరీమున్నీసా తో కలిసి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ జీవితంలో ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలన్నారు. గత తెలుగుదేశం హయాంలో విజయవాడ నగరంలో పదుల సంఖ్యలో ఆలయాలను కూల్చివేశారన్నారు. చిన్న ఆలయాల నుంచి శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న పురాతన ఆలయాలను సైతం తొలగించారన్నారు. వీరబాబు స్వామి ఆలయానికి 110 సంవత్సరాల ఘన చరిత్ర ఉందన్నారు. అంతటి ప్రశస్త్యం కలిగిన ఆలయాన్ని సైతం పుష్కరాల పేరిట నిర్దాక్షిణ్యంగా కూలదోసి చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం హయాంలో కూల్చివేతకు గురైన ఆలయాలన్నింటినీ అవే ప్రదేశంతో పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. వీరబాబు ఆలయాన్ని కూడా రూ.13 లక్షలతో పునర్ నిర్మిస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని మతాలు, వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ.. సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు గొంట్ల రామ్మోహన్ రావు, బసవరాజు, సురేష్, వీరబాబు, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.
