Breaking News

సాగు ఖ‌ర్చుల‌కు అనుగుణంగా పంట రుణాలు

– అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని రుణ ప‌రిమితి ప్ర‌తిపాద‌న‌లు
– ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను రైతులు స‌ద్వినియోగం చేసుకోవాలి
– డీఎల్‌టీసీ స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ పంట‌ల సాగు ఖ‌ర్చుల‌కు అనుగుణంగా రైతుల‌కు పంట రుణాల మంజూరుకు మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, స్వ‌ర్ణాంధ్ర @ 2047 ల‌క్ష్యాల సాధ‌న‌కు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో రైతులు కీల‌క భాగ‌స్వాములు కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
కృష్ణాజిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌-ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి సాంకేతిక క‌మిటీ (డీఎల్‌టీసీ) స‌మావేశం బుధ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ స‌మావేశానికి వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల అధికారులు, ప్ర‌గ‌తిశీల రైతులు, బ్యాంక‌ర్లు త‌దిత‌రులు హాజ‌రుకాగా 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి వివిధ పంట‌ల‌కు ఎక‌రా విస్తీర్ణానికి రుణ ప‌రిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌)పై ప్ర‌తిపాద‌న‌ల రూప‌క‌ల్ప‌న‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మావేశంలో చ‌ర్చించారు. 2023-24, 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రాల్లో ఖ‌రీఫ్‌, ర‌బీ సీజ‌న్ల‌లో వివిధ పంట‌ల సాగు వ్య‌యం, పంట దిగుబ‌డి విలువ‌, రుణ ప‌రిమితి వివ‌రాలను ప‌రిశీలించి.. త‌దుపరి 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో సాగు ఖ‌ర్చు, దిగుబడి విలువ అంచ‌నాల ఆధారంగా నిర్ణ‌యించాల్సిన రుణ ప‌రిమితిపై వ్య‌వ‌సాయం, ఉద్యాన‌, మ‌త్స్య త‌దిత‌ర శాఖ‌ల అధికారులు త‌మ అభిప్రాయాల‌ను స‌మావేశం ముందుంచారు. అదేవిధంగా రైతులు వివిధ పంట‌ల సాగుకు సంబంధించి విత్త‌నాలు, ఎరువులు, పురుగు మందులు, పంట కోతలు త‌దిత‌రాల‌కు అయ్యే ఖ‌ర్చుల వివ‌రాల‌ను తెలియ‌జేశారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని జిల్లాస్థాయి సాంకేతిక క‌మిటీ ద్వారా 2025-26కు గాను వ‌రికి రుణ ప‌రిమితి రూ. 46 వేలు, మిర‌ప (డ్రై)కు రూ. 1,10,000, మిర‌ప (ఇరిగేటెడ్‌)కు రూ. 1,15,000, మామిడికి రూ. 42,500, ఆయిల్‌పామ్‌కు రూ. 75 వేలు, ప‌ట్టు పురుగుల పెంప‌కానికి రూ. 60,000 ఇలా వివిధ పంట‌లు, వ్య‌వ‌సాయ అనుబంధ కార్య‌క‌లాపాల‌కు రుణ‌ప‌రిమితిని ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గ‌తేడాది కంటే అధిక రుణ ప‌రిమితిని ప్ర‌తిపాదించిన‌ట్లు తెలిపారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ ప‌రిమితి)కి అద‌నంగా 30 శాతం వ‌ర‌కు బ్యాంకులు రుణాలు మంజూరు చేసేందుకు అవ‌కాశ‌ముంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాల రైతుల సంక్షేమానికి అమ‌లుచేస్తున్న వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను రైతులు స‌ద్వినియోగం చేసుకొని ఉన్న‌తంగా ఎద‌గాల‌ని ఈ సంద‌ర్భంగా క‌ల‌క్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.
స‌మావేశంలో కృష్ణాజిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ సీఈవో ఎ.శ్యామ్ మ‌నోహ‌ర్‌, జీఎం ఎ.రంగ‌బాబు, అసిస్టెంట్ ఎల్‌డీఎం ఎం.ర‌మేష్‌, జిల్లా వ్య‌వ‌సాయ అధికారి బి.విజ‌య‌కుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్‌, ప్ర‌గ‌తిశీల రైతులు కె.న‌ర‌సింహారావు, పి.నాగేశ్వ‌ర‌రావు, ఎ.అజ‌య్ కుమార్‌, పీఎస్ఆర్ ప్ర‌సాద్‌, ఎం.రాజశేఖ‌ర్‌, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐవోబీ, యూకో త‌దిత‌ర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *