Breaking News

ఆగస్టు 5 న్యూఢిల్లీలో ధర్నాకు పిలుపు … : సిపిఐ కె.రామకృష్ణ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివాసి పరిరక్షణ, పోలవరం ముంపు బాధితులు రక్షణ కోసం ఆగస్టు 5 న్యూఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు ఆంధ్రప్రదేశ్ వైసిసి, టిడిపిలకు చెందిన లోక్ రాజ్యసభ సభ్యులు పాల్గొనాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం ప్రైవేటీకరిస్తుంటే, ప్రత్యేక హోదా ఇవ్వక అన్యాయం చేస్తుంటే ఎపికి చెందిన లోక్ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఏం చేస్తున్నారని, పార్లమెంట్ ఉండి శనక్కాయాలు అమ్ముకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఏం సాధించలేనప్పుడు లోక్ స‌భ‌, రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, బ‌షీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎపి ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు, ఆంధ్రమేథావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, నేష‌న‌ల్ ఆదివాసి అఖిల ప‌క్షాల సంఘం (జెఎసి) క‌న్వీన‌ర్‌, మాజీ ఎంఎల్ఎ చంద లింగయ్య దోర, అఖిల భారత ఆదివాసి మహాసభ జాతీయ కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్ తో కలిసి రామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసి పరిరక్షణ,పోలవరం ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి ఢిల్లీకి వెళ్లి ఎంపిల మద్దతు కోరుతామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అంశంలో భూసేకరణ, పునరవాస చర్యలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని సాక్షాత్తు కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటించారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపైన ఎపి ప్రభుత్వం ఒత్తిడిని పెంచి నిధులను సాధించుకోకపోతే దళితులు, గిరిజనులు, ముంపు బాధితుల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. బహుళార్ధక పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం కుదించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 196 టిఎంసిలను నిల్వ‌చేసే సామర్థాన్ని 115 టిఎంసిలకు పడిపోయే అవకాశం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ముంపు బాధితులకు రూ. 10లక్షలు ఇస్తామని వై.ఎస్. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ్ల పాదయాత్రలు, పలు కార్యక్రమాల వేదికల మీద హామీనిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు బాధ్యత లేకుండా బాధితులను నీళ్లలో ముంచుతున్నారని విమర్శించారు. పోలవరం విషయంలో ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని చెబుతున్న సిఎం జగన్, అధికారిని ఎప్పుడు నియమిస్తారు. బాధితులకు ఎప్పుడు న్యాయం చేస్తారు?, వారికి ఎప్పటి వరకు ఇండ్లు నిర్మించి ఇస్తారు అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధిస్తామని, కడపలో స్టీల్ ఏర్పాటు చేస్తామని జగన్ హామీనిచ్చారని, ఇప్పుడు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం ముంపు బాధితులను పట్టించుకోకపోవడంతో వారు సర్వం కోల్పోయి కొండల ప్రాంతాల్లో నివసిస్తున్నారని, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ పోలవరం ముంపు బాధితుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వం లేకుండా వ్య‌వ‌హారిస్తున్నాయ‌ని ఆరోపించారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ముంపు ప్రాంత ఆదివాసిలు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సెస్‌ల‌పైన సెస్ను విధిస్తూ రాష్ట్రాలకు వాటాలు కూడా ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ అన్యాయం చేస్తుంటే ఎపి, తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు పట్టించుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు భయపడుతున్నారని ఆరోపించారు.
చంద లింగయ్య దోర మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ముంపు బాధితుల విషయంలో కేంద్రం తమకు సంబంధం లేదంటే ఎలా అని మండిపడ్డారు. అటు కేంద్రం, ఇటు తెలంగాణ, ఎపి ప్రభుత్వాలు కూడా తమకు సంబంధం లేదని చెబితే గిరిజనులు, ఆదివాసిలను ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు. ఎవరికీ సంబంధం లేనప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించారన్నారు. పోలవరం ముంపు బాధితుల సమస్యలపై అఖిలపక్ష సమావేశానికి కేంద్రంలోని బిజెపి, వైసిపి, టిఆర్ఆర్‌ నేతలు హాజరవ్వలేదని, వారు దొంగలు కాబట్టే సమావేశానికి రాలేదన్నారు. ఆదివాసిల పరిరక్షణ,ముంపు బాధితుల రక్షణ విషయమై ఈనెల 30న ఎపి గరవ్నర్ కలిసి వినతిపత్రం అందజేస్తామని, ఈ సమస్యపై న్యాయ, రాజకీయ పోరాటం చేస్తామని తెలిపారు.

Check Also

కేంద్ర ప్ర‌భుత్వం రూ.1100 కోట్ల వ‌ర‌ద సాయాన్ని త్వ‌ర‌గా అందించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్ షా కు విజ్ఞ‌ప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *