Breaking News

సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం సమాధి చేసింది

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం సమాధి చేసిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ఉంటుందని.. అలా 99.4 శాతం హామీలను అమలు పరిచిన ఘనత రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లిందని మల్లాది విష్ణు అన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య, విజ్ఞప్తులన్నింటినికీ.. అధికారంలోకి వచ్చిన వెనువెంటనే సంక్షేమ క్యాలెండర్ ద్వారా వైఎస్ జగన్మహన్ రెడ్డి పరిష్కారం చూపారన్నారు. ఏ మాసంలో ఏ రోజున ఏ పథకం అమలు చేస్తామో ముందుగా ప్రకటించి మరీ అమలు పరిచామని.. ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలోనూ సంక్షేమ క్యాలెండర్ ను ప్రదర్శించి తమ నిబద్ధతను చాటుకున్నామన్నారు. కోవిద్ సమయంలోనూ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సంక్షేమాన్ని అమలు పరిచి.. ఏ రాష్ట్రంలోనూ లేనంత గుడ్ గవర్నెన్స్ ను ప్రజలకు అందించామన్నారు. అటువంటి ప్రభుత్వంపై బురదచల్లుతూ.. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రజలలోకి తప్పుడు సంకేతాలు పంపారని మండిపడ్డారు. తాము వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మించి సంక్షేమాన్ని అమలు పరుస్తామంటూ ప్రజలను మభ్యపెట్టారన్నారు.

చంద్రబాబువన్నీ బూటకపు హామీలు
ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేయటం చంద్రబాబు నైజమని మల్లాది విష్ణు విమర్శించారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతానని.. పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచుతానని మార్చి 28, 2024 న అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం బహిరంగ సభలో ఇచ్చిన మాట ఏమైందని చంద్రబాబును ప్రశ్నించారు. పైగా నిజమైన బటన్ నొక్కుతానంటూ.. ఉత్తుత్తి బటన్ కాదంటూ ఆనాడు బాబు అన్న మాటలను చూసి ప్రజలిప్పుడు నవ్వుకుంటున్నారన్నారు. ఆడబిడ్డ ఉన్న స్త్రీలకు నెలకు రూ.1,500 అందిస్తామని.. ఇద్దరు ఆడపిల్లలు ఉంటే రూ.3000., ముగ్గురు ఉంటే రూ.4,500., నలుగురు ఉంటే రూ.6 వేలు ఇస్తామంటూ ఏప్రిల్ 4 న తణుకు ప్రజాగళం సభలో బాబు మాట్లాడారని గుర్తుచేశారు. రైతులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందచేసి అన్నదాతను రాజును చేస్తామని.. ఏప్రిల్ 05 న నరసాపురం ప్రజాగళం సభలో గొప్పగా చెప్పారని మాట్లాడారు. తన పుట్టినరోజున కూడా గూడూరులో అక్కచెల్లెమ్మలతో ముచ్చటిస్తూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ అబద్ధపు హామీలతో బాబు మోసగించారని చెప్పారు. జాబు రావాలంటే కూటమి అధికారంలోకి రావాలంటూ.. ఉద్యోగం వచ్చేవరకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ మే 9 న కురుపాంలో యువతకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక హామీల అమలంటే భయమేస్తోందని బాబు మాట్లాడటం సరికాదన్నారు. 2014లోనూ ఇదేవిధంగా రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని నమ్మించి.. చివరకు రూ. 15 వేల కోట్లతో బాబు సరిపెట్టారని మల్లాది విష్ణు అన్నారు. ఇలా అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి మేనిఫెస్టోను అమలు పరచని పార్టీలపై చర్యలు తీసుకోవాలని 2019లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లిందని తెలిపారు.

8 నెలల కాలంలో రూ. లక్షా 19 వేల కోట్ల అప్పులా..?
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక క్రమశిక్షణతో పేదరికాన్ని నిర్మూలించి.. రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధి బాటలో పయనించేలా చేయడంలో తాము సఫలీకృతమయ్యామని మల్లాది విష్ణు అన్నారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలు ఇలా రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి పరచి ఆంధ్రప్రదేశ్ ను వికసిత ఆంధ్రప్రదేశ్ గా మార్చి చూపామన్నారు. కానీ రాష్ట్రానికి రూ. 16 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆనాడు గోబెల్స్ ప్రచారం చేసి ప్రజలలోకి తప్పుడు సంకేతాలు పంపారని దుయ్యబట్టారు. కొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ఆరోజున వీరికి వత్తాసు పలికారన్నారు. చేయని అప్పులపై ఆనాడు బాకాలు ఊదిన కూటమి పెద్దలు గత 8 నెలల కాలంలో చేసిన రూ. లక్షా 19 వేల కోట్ల అప్పులపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జనసేన నేతలకు భూములను ధారాదత్తం చేయడంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ.. పేదల జీవన స్థితిగతులను మెరుగుపర్చడంపై లేకపోవడం బాధాకరమన్నారు.

ప్రజల మైండ్ నుంచి సూపర్ 6 ని తొలగించే కుట్ర
2014 లో అధికారంలో ఉండగా ఎన్నికల మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తొలగించిన కూటమి పెద్దలు.. ఈసారి మేనిఫెస్టోను ఏకంగా ప్రజల మైండ్ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. ఇప్పటికే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి.. పేద విద్యార్థులకు మెడికల్ విద్యను అందని ద్రాక్షగా మార్చేశారన్నారు. అన్నదాత సుఖీభవ ఇస్తామని 54 లక్షల మంది రైతులను., తల్లికి వందనం పేరుతో 40 లక్షల మంది తల్లులను., ఆడబిడ్డ నిధి పథకం పేరుతో కోటి 80 లక్షల మంది మహిళలను., నిరుద్యోగ భృతి పేరుతో కోటి మంది యువతను వంచించారన్నారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చలేమని బాబు మాట్లాడటం చూస్తుంటే.. చంద్రబాబుకి రాజకీయ విలువలు, విశ్వసనీయత లేవని స్పష్టంగా తెలుస్తున్నాయన్నారు. కనుకనే గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు తప్ప ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క పెట్టుబడి కూడా రాలేదని విమర్శించారు. మరోవైపు అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరిచిన కూటమి సర్కారు.. యూజర్ ఛార్జీలు, ఆస్తి పన్ను పెంచుతూ మరో పిడుగు ప్రజలపై వేసేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు.

విద్యార్థులకు అండగా వైఎస్సార్ సీపీ
ప్రతి పేద విద్యార్ధి ప్రపంచస్థాయిలో అవకాశాలకు పోటీ పడాలని ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తే, నేడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు విద్యార్ధుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యాదీవెన కింద రూ.2,800 కోట్లు, వసతిదీవెన కింద రూ.1100 కోట్ల స్కాలర్‌ షిప్‌.. రెండూ కలిపి దాదాపు రూ.3,900 కోట్ల బకాయి పడిందని పేర్కొన్నారు. దీంతో కొన్ని చోట్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్ధులను క్లాస్‌లకు రానివ్వడం లేదని, మరికొన్ని చోట్ల సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి నేపథ్యంలో విద్యార్థులకు అండగా ఫిబ్రవరి 5న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘ఫీజుపోరు’ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు చెప్పారు. ఆరోజున ప్రతి జిల్లా కేంద్రంలో వైసీపీ నేతలు విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, నాయకులు యరగొర్ల శ్రీరాములు, హఫీజుల్లా, అలంపూర్ విజయ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *