-మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా సమన్వయంతో నిర్వహించండి: జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్
-ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఘనంగా మహా శివరాత్రి ఏర్పాట్లకు మంత్రుల బృందం సమీక్ష సమావేశం… మహోత్సవాల నిర్వహణ ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మికత, సమైక్యత పెంపొందించడం సిఎం లక్ష్యం
-క్యూ లైన్లలో భక్తులకు వాటర్ బాటిల్, ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తాం… మహిళలు, పిల్లలకు క్యూ లైన్లో పాలు, బిస్కెట్లు అందించనున్నాం
-27వ తేదీన శ్రీకాళహస్తి స్థానికులకు టికెట్ ధర లేకుండా ఉచిత దర్శనానికి అవకాశం కల్పిస్తున్నాం: దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణ రెడ్డి
శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పలు బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవంగా నిర్వహించుటకు ఆదేశాలు ఇచ్చారని తద్వారా ప్రభుత్వం లక్ష్యం ప్రజలలో ఆధ్యాత్మికతను, సఖ్యతను పెంపొందుతుందని తెలుపుతూ అందరినీ సమన్వయం చేసుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ దేవి అమ్మవారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు ఆం.ప్ర రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు ఆం.ప్ర రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి మునిసిపల్ కమిషనర్ కార్యాలయం సమావేశ మందిరం నందు రానున్న మహాశివరాత్రి 2025 ఏర్పాట్లపై కమిషనర్ దేవాదాయ శాఖ రామచంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, ఎంఎల్ఏ బొజ్జల సుధీర్ రెడ్డి పలు శాఖల అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు మంత్రుల బృందం దిశా నిర్దేశం చేశారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఆలయాలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోందని, ముఖ్యమంత్రి పాలన బాగా ఉందని తెలిపారు. సామాన్య భక్తులకు మంచి దర్శనం కలిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శివరాత్రికి వారం ముందు, వారం తర్వాత కూడా భక్తుల రద్దీ ఉంటుందని తదనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అధికంగా భక్తులు రానున్న నేపథ్యంలో ప్రణాళికలు పక్కాగా ఉండాలని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి గారు అత్యంత జాగ్రత్త గా చేపట్టాలని ఆదేశించి ఉన్నారని తెలుపుతూ రెవెన్యూ,పోలీస్, దేవాదాయ శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని, వీఐపీ ల దర్శనాలకు టైం స్లాట్ ఏర్పాటుకు సమీక్షించాలని, ఎంఎల్ఏ సూచనలు ఆహ్వానించదగినవని అన్నారు. భక్తులతో సిబ్బంది, ఆలయ అధికారులు దురుసుగా ప్రవర్తించరాదని సూచించారు. బైపాస్ రోడ్ కు సంబంధించి పెండింగ్ భూసేకరణ సత్వరమే చేపట్టాలని కలెక్టర్ కు, ఆర్డీవో కు సూచించారు. ఫెస్టివల్ పొలిటికల్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంఎల్ఎ కి సూచించారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి మహా పర్వాన్ని వైభవంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని, రాష్ట్రంలో ఎక్కడైనా మహోత్సవాలను నిర్వహించినప్పుడు ఆధ్యాత్మికత, ప్రజలలో సఖ్యత పెంపొందించేలా వైభవంగా నిర్వహించాలని సిఎం ఉద్దేశం అని అన్నారు. ఇలాంటి ఉత్సవాలు జరిగినప్పుడు రెవెన్యూ, ఎండోమెంట్, హోమ్ శాఖ మంత్రులు సమన్వయ సమావేశాలు నిర్వహించి దిగ్విజయంగా జరిగేలా చూడాలని ఆదేశించి ఉన్నారని తెలిపారు. ప్రతి భక్తునికి మహాదేవుని అమ్మవారి అనుగ్రహం అందేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని, హోల్డింగ్ ఏరియా, పార్కింగ్ ప్రాంతాలు సక్రమంగా గుర్తించి పార్కింగ్ ప్రాంతం నుండి ఉచితంగా మినీ వాహనాల ఏర్పాట్లు, దేవాలయం వద్దకు భక్తులను చేర్చేలా ఉండాలని సూచించారు. బైపాస్ రోడ్డుకు సంబంధించి పెండింగ్ భూ సేకరణ అంశం పరిష్కార దిశగా దేవాదాయ శాఖ నుండి నిధులు మంజూరు చేస్తామని, అలాగే ఆలయ అభివృద్ధిలో భాగంగా దేవాలయ ప్రాంగణానికి అనుకొని ఉన్న భవనానికి నష్ట పరిహారం చెల్లించడానికి దేవాదాయ శాఖ నిధులు కేటాయిస్తామని, సంబంధిత విస్తరణ పనులను చేపట్టాలని కలెక్టర్ గారికి సూచించారు. 13 రోజుల మహాశివరాత్రి కార్యక్రమాలలో క్యూ లైన్ నందు భక్తులకు లడ్డు ప్రసాదం ఉచితంగా అందరికీ అందిస్తామని, భక్తులకు వాటర్ బాటిల్ ప్రతి ఒక్కరికి అందిస్తామని, గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తుల సంతృప్త స్థాయి మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. పసిపిల్లలు కలిగిన వారికి క్యూలైన్లో ఉన్న మహిళలకు పాలు బిస్కెట్లు అందిస్తామని తెలిపారు. మహాశివరాత్రి పర్వదిన సమయాలలో 24, 25, 26 మూడు రోజులలో జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తురాలికి రవిక,పసుపు కుంకుమ, గాజులు అందిస్తామని మంత్రి తెలిపారు. డ్రోన్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు ద్వారా పర్యవేక్షిస్థామని తెలిపారు. సుమారు 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రద్దీలో పసిపిల్లలు తప్పిపోయే అవకాశం ఉన్నందున 14 సంవత్సరాల లోపు పిల్లలకు జిపిఎస్ ఆధారిత ట్రాకింగ్ బ్యాండ్ ఏర్పాటు చేసి పోలీసు వారి సహకారంతో ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా మహాశివరాత్రి నందు ఏర్పాటు చేసి వారి కదలికలు గమనించి తప్పిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 27వ తేదీన శ్రీకాళహస్తి స్థానికులకు టికెట్ ధర లేకుండా ఉచిత దర్శనానికి అవకాశం కల్పిస్తున్నామని ఆరోజు భక్తులకు కూడా పాలు బిస్కెట్ వాటర్ బాటిల్ అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వీఐపీలకు ప్రత్యేక టైమ్ స్లాట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే సదరు ఏర్పాట్లకు అదనంగా అవసరమయ్యే నిధులను దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రులు సూచించిన విధంగా అన్ని చర్యలు చేపడతామని, భక్తులకు గిరి ప్రదక్షిణ ప్రాంతం రహదారి మరమ్మత్తులు చేయిస్తామని, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తిస్థాయిలో చేపడతామని తెలిపారు. గతంలోనే ఒక సమన్వయ సమావేశం నిర్వహించామని తెలుపుతూ గుడిమల్లం దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచినదని ఆ దేవాలయం వద్ద కూడా ఏర్పాట్లు అన్ని విధాల చేపడుతామని తెలిపారు. మహాశివరాత్రి సమయంలో గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాల మేరకు బాల్య వివాహాలు చేపడతారని వాటిని నివారించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సుమారు 8 నుండి 10 లక్షల భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలుపుతూ పర్యాటక శాఖ వారిని సమన్వయం చేసి పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దర్శనం టోకెన్లు క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా పొంది దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేపడుతున్నామని, అదనపు బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, విఐపి పార్కింగ్ ప్రాంతాలను ఎంఎల్ఏ సూచించిన స్కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం పరిశీలిస్తామని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కిట్స్ లో విఐపి పార్కింగ్ ఏర్పాటుకు పరిశీలించి చర్యలు తీసుకుంటామని, శ్రీకాళహస్తి స్థానికులకు దర్శన భాగ్యం ఉచితంగా కల్పించాలని లడ్డు ప్రసాదాలు ఉచితంగా అందించాలని రహదారి నిర్మాణాల మరమ్మత్తుల అంశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేయగా మంత్రులు, కలెక్టర్ సానుకూలంగా స్పందించగా వారందరికీ ఎంఎల్ఏ ధన్యవాదాలు తెలిపారు. నైట్ విజన్ డ్రోన్ కెమెరాలు వినియోగం ద్వారా పర్యవేక్షణకు సూచనలు చేశారు.
ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్ తగినంత బందోబస్తు ఏర్పాటు చేపడతామని వివరించారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు, హాస్పిటల్ టై అప్, తగినంత మంది వాలంటీర్లు ఏర్పాటు, వారు సక్రమంగా విధులు నిర్వర్తించాలని కోరారు. డ్రోన్ పర్యవేక్షణ, కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఉంటుందని తెలిపారు.
ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించుటకు ప్రభుత్వం, మంత్రులు, జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలందరిపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు.
సమావేశానికి ముందు ఆలయానికి చేరుకున్న మంత్రులకు ఆలయ మర్యాదలతో అర్చకులు, ఆలయ కార్య నిర్వహణాధికారి స్వాగతం పలుకగా మంత్రులు స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వారికి దత్తాత్రేయ స్వామి వద్ద వేద పండితులు ఆశీర్వచనం పలుకగా ఆలయ ఈ.ఓ బాపిరెడ్డి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఉచిత అన్నదాన భోజనశాల నందు భక్తులకు అన్నం వడ్డించిన మంత్రులు.. ఆహారం మరియు ఏర్పాట్లపై మంత్రులు ఆరా తీయగా సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు.
ఈ సమావేశంలో ఆర్డిఓ శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News