-జగనన్న ఇళ్లస్థలం పై యస్ హెచ్ జి సభ్యులకు అదనపురుణంతో ఇళ్ల నిర్మాణానికి భరోసా…
-2,950 మంది లబ్ధిదారులకు రూ. 14.75 కోట్లు రుణం అందజేత…
-లబ్దిదారుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రభుత్వం కేటాయించిన జగనన్న ఇంటి స్థలంపై గృహనిర్మాణానికి 11,419 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు అదనపురుణాలు మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టరు జె.నివాస్ చెప్పారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం ఇండియన్ బ్యాంక్ మైక్రోశాట్ విజయవాడ ఆధ్వర్యంలో యస్ హెచ్ జి గృహలక్ష్మి పథకం ద్వారా గృహనిర్మాణానికి 2,950 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ. 14.75 కోట్ల రుణాలను కలెక్టరు జె.నివాస్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టరు జె. నివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లబ్దిదారులకు ఇంతస్థాయిలో ఇళ్లు నిర్మాణానికి రుణం కల్పించడం ద్వారా రాష్ట్రంలో కృష్ణాజిల్లా మొదటిగా ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఒక క్రొత్త పధకానికి నాంది పలుకుతున్నామన్నారు. జిల్లాలో 11,419 మందికి ఇళ్ల నిర్మాణానికి అదనపు రుణం మంజూరు చేశామన్నారు. ఇందులో భాగంగా తాము చేసిన విజ్ఞప్తికి స్పందించి అక్కా, చెల్లెమ్మలకు ఇండియన్ బ్యాంక్ మద్దతుగా నిలవడం అభినందనీయం అన్నారు. కేవలం రూ. 50 వేల రూపాయలు కాకుండా గృహలక్ష్మి క్రింద రూ. లక్ష రూపాయల వరకూ రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండియన్ బ్యాంక్ వారు ముందుకురావడం సంతోషదాయకం అన్నారు. ఎ ంత పెద్దవారైనా, చిన్నవారైనా కొంత అప్పో, సప్పో ఇంటి నిర్మాణానికి చేయవలసిన అవసరం ఉంటుందన్నారు. ఇంటి నిర్మాణం అంటే అనుకున్నదానికన్నా కొంత ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జగనన్న ఇళ్లకాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే యస్ ఏజ్ గ్రూప్ సభ్యులకు ఇంటి నిర్మాణ ప్రారంభంలో ఈ అదనపు రుణంతో వారిలో భరోసా కల్పిస్తున్నామన్నారు. ఒక మంచి ప్రారంభానికి చిరుమద్ధతు అని ఆయన పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఇళ్లు నిర్మించుకోవాలని వారికి ప్రభుత్వం నుండి రూ. 1.80 లక్షలు ఆర్ధిక సహాయం అందుతుందని దీనిపై గౌరవ ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన కూడా చేశారన్నారు. వారంవారం బిల్లులు చెల్లింపు జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రారంభదశలో పునాది నిర్మాణానికి ఇతర నిర్మాణ సామాగ్రికి బ్యాంకు ద్వారా అందించే రూ. 50 వేలు కొంతమేర ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈసొమ్మును ఇతర అవసరాలకు వినియోగించకుండా మీకోసం, మీమంచి కోసం మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి నగరం నుంచి తమకు కేటాయించిన ఇంటి స్థలంలో ఇళ్ల నిర్మాణం పై రోజూ వెళ్లి పర్యవేక్షించుకోలేనివారు 20 నుంచి 25 మందిని ఒక గ్రూపుగా చేసి ఇళ్ల నిర్మాణానికి ఒక కాంట్రాక్టరును అప్పగించడం జరుగుతుందని అదీకూడా మీకు నచ్చిన కాంట్రాక్టరును ఎంపిక చేసుకోవచ్చన్నారు. తద్వారా త్వరగా ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉందన్నారు. మీతరపున ఇళ్ల నిర్మాణ ప్రగతినిబట్టి కాంట్రాక్టరుకు చెల్లింపు జరుగుతుందన్నారు.
నగరపాలకసంస్థ కమిషనరు వి. ప్రసన్నవెంకటేష్ మాట్లాడుతూ ఇంతమందికి ఇళ్లస్థలాలు అందజేసి ఇళ్ల నిర్మాణానికి తోడ్పడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి మంచి వాతావరణంలో ఇళ్ల కాలనీలు ఉండేలా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుందన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో పాటు బ్యాంకు ద్వారా అదనపు రుణం సదుపాయం కల్పించడం ఇదే మొదటిసారి అన్నారు. అందిన రుణం ఇంటి నిర్మాణంపై పెట్టి నిర్మాణం పూర్తి చేసుకోవాలన్నారు. లబ్దిదారులంతా త్వరలోనే గృహప్రవేశాలు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఇండియన్ బ్యాంకు జోనల్ మేనేజరు కె.వి.రాజశేఖరరావు మాట్లాడుతూ యస్ హెబ్ సభ్యులకు ఇళ్ల నిర్మాణాల కోసం అదనపు రుణం మంజూరు చేయాలని ఈ నెల 16న జిల్లా కలెక్టరు జె. నివాస్ వారు చేసిన సూచన స్పూర్తిగా తీసుకుని అదనపురుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతీ కుటుంబానికి ఇల్లు అనేది చాలా ముఖ్యమన్నారు. మిగిలిన సభ్యులు ఎవరు వచ్చినా రుణాలు మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇండియన్ బ్యాంకు విజయవాడ మైక్రోశాట్ శాఖ బ్రాంచి మేనేజరు జి. రాంబాబు మాట్లాడుతూ తమశాఖ నగర పరిధిలోని మూడు సర్కిలో 2,638 మందికి రూ. 13.19 కోట్లు, పెనమలూరు, తోట్లవల్లూరు, విజయవాడ రూరల్ కు సంబంధించి 312 మందికి రూ. 1.56 కోట్లు రుణాలు మంజూరు చేశామన్నారు.
విజయవాడ మొగల్రాజపురంకు చెందిన కె.శ్యామల మాట్లాడుతూ ఇంటి స్థలమైతే మంజూరైంది కానీ ఇల్లు నిర్మించుకోవడం ఆలోచనలో పడిన సమయంలో కలెక్టరు గారి సూచనతో ఇండియన్ బ్యాంకు వారు ముందుకు వచ్చి రుణం అందించడంతో తమకు ధైర్యం వచ్చిందని చెప్పారు. విజయవాడలో 22 సంవత్సరాల నుంచి నివసిస్తున్నామని తమలాంటి పేదలను గుర్తించి స్వంత ఇంటికల సాకారం చేస్తున్న జగనన్నకు ధన్యవాదాలు అన్నారు.
తోట్లవల్లూరు మండలం బొడ్డుపాడు గ్రామానికి చెందిన ఇందిర మాట్లాడుతూ తనకు వివాహమై 13 సంవత్సరాలు అయ్యిందని ఇద్దరు పిల్లలు కలిగి ఉన్న తమకు స్వంత ఇల్లు లేదన్నారు. తమకు ఇంటి స్థలం మంజూరు చేసిన సియం జగనన్నకు గృహలక్ష్మి క్రింద రుణం అందించిన బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు అన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు (సంక్షేమం) కె. మోహన్ కుమార్ , బ్యాంకు జోనల్ మేనేజరు కె.వి.రాజశేఖరరావు, డిఆర్ డిఏ పిడి శ్రీనివాసరావు, యల్ డియం ఆర్. రామ్మోహనరావు, హౌసింగ్ పిడి రామచంద్రన్, ఇండియన్ బ్యాంకు డిజియం యం. సెల్వరాజ్, డిస్ట్రిక్టు కోఆర్డినేటర్ కళాధర్ , ఎ జియం సంజీవరావు, బ్రాంచి మేనేజరు జి. రాంబాబు, ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.