Breaking News

ప్ర‌త్యేక కార్యాచ‌ణ‌తో అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల అమ‌లు..

– ఆకాంక్షిత బ్లాకుల్లో విద్య‌, వైద్యం, పోషణ‌పై ప్ర‌త్యేక దృష్టి
– వంద శాతం ఫ‌లితాలు సాధించే దిశ‌గా అధికారుల కృషి
– పెనుగంచిప్రోలు క్షేత్ర‌స్థాయిలో క‌లెక్ట‌ర్ డా. ల‌క్ష్మీశ విస్తృత త‌నిఖీలు

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ) కింద కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసిన జిల్లాలోని ఇబ్ర‌హీంప‌ట్నం, పెనుగంచిప్రోలు మండ‌లాల్లో ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌తో అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు అమ‌లుచేస్తుండ‌టంతో మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని.. ఇదే స్ఫూర్తితో స‌మ‌గ్రాభివృద్ధిలో ఈ రెండు బ్లాక్‌ల‌ను ముందంజ‌లో నిలిచేలా కృషిచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.
శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆకాంక్షిత బ్లాక్ అయిన పెనుగంచిప్రోలులో క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి, వివిధ సూచిక‌ల్లో ప్ర‌గ‌తికి అమ‌లుచేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించారు. పోష‌ణ‌కు సంబంధించి క్షేత్ర‌స్థాయిలో తీసుకున్న చ‌ర్య‌లు, వాటి అమ‌లుతీరును ప‌రిశీలించ‌డంలో భాగంగా అంగ‌న్వాడీ కేంద్రాన్ని సంద‌ర్శించారు. కేంద్రం ద్వారా అందిస్తున్న పోష‌కాహారాన్ని ప‌రిశీలించారు. చిన్నారుల‌తో ముచ్చ‌టించి పూర్వ ప్రాథ‌మిక విద్యా నైపుణ్యాల‌ను ప‌రిశీలించారు. అంగ‌న్వాడీ కేంద్రాల్లో చిన్నారుల శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్య వికాసానికి అందుబాటులో ఉన్న వ‌స‌తులు, ఇంకా అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాల‌ను పరిశీలించారు. మెనూ ప్ర‌కారం అందిస్తున్న ఆహారాన్ని ప‌రిశీలించారు. వైద్య ఆరోగ్య రంగంలో సూచిక‌ల్లో ప్ర‌గ‌తికి సంబంధించి ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల ద్వారా చేప‌ట్టిన స‌మ‌గ్ర ఆరోగ్య స‌ర్వే (ఎన్‌సీడీ 3.0)లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పాల్గొన్నారు. ముంద‌స్తు ప‌రీక్ష‌లు ఆరోగ్య భ‌ద్ర‌త‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు చేకూర్చుతాయ‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. సందేహించ‌కుండా, నిర్ల‌క్ష్యం చేయ‌కుండా, ఆల‌స్యం లేకుండా చేయించుకునే ప‌రీక్ష‌ల‌తో ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుకోవ‌చ్చని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న చిన్నారుల‌పై దృష్టి:
ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న చిన్నారులకు మంచి భ‌విష్య‌త్తును అందించాల‌నే ల‌క్ష్యంతో, విద్యా హ‌క్కు చ‌ట్టం అమ‌లు ద్వారా మెరుగైన ఫ‌లితాలు సాధించాల‌నే నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌ధానంగా ఆకాంక్షిత బ్లాకుల్లో ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న చిన్నారుల‌పై అధికార యంత్రాంగం ప్ర‌త్యేకంగా దృష్టిసారించింది. ఇందులో భాగంగా మండ‌లంలోని వివిధ ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు చెందిన 79 మంది ఉపాధ్యాయుల‌కు కేవీఆర్ జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో గురు, శుక్ర‌వారం నిర్వ‌హించిన స‌హిత విద్య శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న చిన్నారుల‌ను గుర్తించ‌డం, సైన్ లాంగ్వేజ్‌, బ్రెయిలీ లిపి, విద్యా హ‌క్కు చ‌ట్టం-11 సూచిక‌లు, అందుబాటులో ఉన్న ఉప‌కార‌వేత‌నాలు త‌దిత‌రాల‌పై ఉపాధ్యాయుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌గా, క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శిక్ష‌ణ పూర్తిచేసుకున్న ఉపాధ్యాయుల‌కు స‌ర్టిఫికెట్లు ప్ర‌దానం చేశారు. ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న చిన్నారులకు సమాన విద్యావ‌కాశాలు అందించిన‌ప్పుడే వారి స‌మ‌గ్రాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని, విద్యార్జ‌న‌లో ఉన్న అవ‌రోధాల‌ను తొల‌గించాల్సిన బాధ్య‌త ప్ర‌తిఒక్క‌రిపైనా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌తో కూడా క‌లెక్ట‌ర్ ముచ్చ‌టించి, త్వ‌ర‌లో ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వారి స‌న్న‌ద్ధ‌త‌ను ప‌రిశీలించారు. ప్ర‌స్తుత స‌మ‌యం చాలా కీల‌క‌మ‌ని.. ఈ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకొని బాగా చ‌దివి మంచి ఫ‌లితాలు సాధించాల‌ని సూచించారు.

రూ. 300 దిన‌స‌రి వేత‌నం ఉపాధి హామీ కూలీల హ‌క్కు:
జాతీయ గ్రామీణ ఉపాధి హ‌మీ ప‌థ‌కం ద్వారా కూలీలు దిన‌స‌రి స‌గ‌టు వేత‌నం రూ. 300 హ‌క్కుగా పొందేలా క్షేత్ర‌స్థాయి అధికారులు, సిబ్బంది స‌రైన ప్ర‌ణాళిక‌తో చేప‌ట్టాల్సిన ప‌నుల‌పైనా క‌లెక్ట‌ర్ మార్గ‌నిర్దేశ‌నం చేశారు. ఉపాధి హామీ కూలీల‌తో ఆయ‌న ముచ్చ‌టించారు. పెనుగంచిప్రోలు ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని కూడా క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. నీటి వ‌న‌రు, ఆయ‌క‌ట్టు, పంపింగ్ హెడ్‌, పంపు సెట్లు, పంపు హౌస్ త‌దిత‌ర వివ‌రాల‌ను ప‌రిశీలించారు.
క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లో క‌లెక్ట‌ర్ వెంట ఇబ్ర‌హీంప‌ట్నం బ్లాక్ కోఆర్డినేట‌ర్ పి.శ్రీనివాస్‌, పెనుగంచిప్రోలు బ్లాక్ కోఆర్డినేట‌ర్ మోహ‌న్ సందీప్, స‌మ‌గ్ర‌శిక్ష అడిష‌న‌ల్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్ జి.మ‌హేశ్వ‌ర‌రావు, డ్వామా పీడీ ఎ.రాము, పెనుగంచిప్రోలు ఎంపీడీవో జి.శ్రీను, త‌హ‌సీల్దార్ శాంతిల‌క్ష్మి, ఇత‌ర మండ‌ల‌స్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *