-జి.కొండూరు వివాదానికి దేవినేని ఉమానే ప్రధాన కారణం...
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం నేత దేవినేని ఉమా పెద్ద డ్రామా ఆర్టిస్టు అని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. బుధవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలంతా టీడీపీని ఏకపక్షంగా తిరస్కరించినా, మరీముఖ్యంగా దేవినేని ఉమాను ఛీ కొట్టినా బుద్ది మారలేదన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక ఇటువంటి కుట్రలు చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. మంత్రిగా ఉండి కూడా గెలవలేకపోయినందుకు దేవినేని ఉమా సిగ్గుపడాలన్నారు. మైనింగ్ అక్రమాలు జరిగితే.. అధికారుల దృష్టిలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అనుచర గణంతో రాత్రిపూట పరిశీలనకు వెళ్లవలసిన అవసరం ఏం వచ్చిందన్నారు? పైగా ప్రశ్నించిన స్థానిక వైఎస్సార్ సీపీ నేతలపై భౌతిక దాడికి తెగబడటం హేయమన్నారు. ఆ విజువల్స్ ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బయటపెడితే.. తిరిగి ఆయనపై బురద జల్లాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు డైరక్షన్ లో దేవినేని ఉమా గోబెల్స్ ను మించిపోయారని మల్లాది విష్ణు అన్నారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను ఇప్పటికే పోలీసులు వెల్లడించారని, కనుక దేవినేని ఉమా డ్రామాలను కట్టిపెట్టాలన్నారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని చేస్తున్న చిల్లర రాజకీయాలను ఆపాలన్నారు. లేనిపక్షాన జక్కంపూడిలో తరిమికొట్టినట్లు ప్రజలు తరిమితరిమి కొడతారని హెచ్చరించారు.