గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనుల నిలిపివేత ఉత్తర్వులు అమలులో ఉన్నందున తదుపరి ఏవిధమైన పనులు జరగడానికి వీలులేదని, పర్యవేక్షణకు అదనపు కమిషనర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటి ప్రాధమిక నివేదిక ఇచ్చిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్, కమిటిలోని అధికారులతో కలిసి స్థానిక పట్టాభిపురం మెయిన్ రోడ్ లోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ సెల్లార్లు, గృహ ప్రవేశం జరిగిన ఫ్లోర్, నిర్మాణ ప్రదేశాలు, పరిసరాలను సమగ్రంగా పరిశీలించి, అధికారులు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్వహకులు నిర్మాణ పనులు ఆపాలని స్టాప్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ పనులు కొనసాగిస్తున్నారని పలు ఫిర్యాదులు అందుతున్నాయని, మెరుగైన పర్యవేక్షణ కోసం ఉన్నతాధికారులతో ప్రత్యేక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. అధికారుల కమిటి ప్రాధమిక విచారణ నివేదిక అందించిందని, నివేదిక మేరకు మంగళవారం తాము పరిశీలించి, సూచించిన అంశాలను కూడా నివేదికలో చేర్చి తుది నివేదిక ఇవ్వాలని, నివేదిక మేరకు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బృందంలోని అధికారులు ఎప్పటికప్పుడు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉండాలని, తదుపరీ ఏ పనులు జరుగుతున్నా తక్షణం తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
పర్యటనలో కమిటి సభ్యులు అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటి కమిషనర్ సి.హెచ్ శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్, ఈఈ కోటేశ్వర రావు, ఎస్ఎస్ సోమశేఖర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News