మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణకు ప్రజల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. పెడన మండలం బల్లిపర్రు గ్రామంలో బుధవారం ఉదయం గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా శానిటేషన్ సిబ్బందికి అందించాలన్నారు. పొడి తడి చెత్తలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు. రహదారులు, డ్రైన్లలో చెత్తను వేయకుండా ప్రత్యేక డస్ట్ బిన్ లలో వేసి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
బల్లిపర్రు గ్రామపంచాయతీలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. కంపోస్ట్ ఎరువుగా తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. గ్రామంలో సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రానికి తరలించి కంపోస్ట్ ఎరువుగా మార్చాలన్నారు. అన్ని సంపద కేంద్రాలు వాడుకలో ఉండాలన్నారు. తడి పొడి చెత్తలను వేరుచేసి తడి చెత్తను ఎరువుగా మార్చి విక్రయించడం ద్వారా గ్రామపంచాయతీకి అదనపు ఆదాయం లభిస్తుందని కలెక్టర్ అన్నారు.
Prajavartha Online Telugu News