-ఆగష్టు 13వ తేదీన ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రధానం…
-నగరంలో అవార్డుల ప్రధానోత్సవ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖా మంత్రి, తదితరులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విశిష్ట వ్యక్తులకు ప్రకటించిన వై.యస్.ఆర్. జీవితసాఫల్య, వై.యస్.ఆర్. సాఫల్య పురస్కారాలను ఆగష్టు నెల 13వ తేదీన ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ప్రధానం చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. నగరంలోని బందరు రోడ్ లోని ఏ1 కన్వెన్షన్ హాలును గురువారం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టరు జె. నివాస్, నగర పోలీస్ కమిషనరు బత్తిన శ్రీనివాసులు, నగరపాలక కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్ ల తో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీ లించారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించి వేదిక ఏర్పాట్లు, ఇతర ఏర్పాట్లుకు సంబంధించి ఏ1 కన్వెన్షన్ హాలు ఏమేర అనువుగా ఉంటుందో వారు పరిశీలించి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు పై సమీక్షించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్ల పై కూడా వారు సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విశిష్ట వ్యక్తులకు ఈనెల 7వ తేదీన వై.యస్.ఆర్. జీవితసాఫల్య, వై.యస్.ఆర్. సాఫల్య పురస్కారాలకు సంబంధించి 6 విభాగాల్లో సంస్థలు, వ్యక్తులకు కలిపి 62 అవార్డులు ప్రకటించడం జరిగిందన్నారు. ఈ అవార్డులను ఆగష్టునెల 13వ తేదీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి చేతులు మీదుగా ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. వైయస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుకు రూ. 10 లక్షలు నగదు, జ్ఞాపిక, వైయస్ఆర్ అచీవ్ మెంట్ అవార్డుకు రూ. 5 లక్షలు నగదు, జ్ఞాపికను అందించడం జరుగుతుందన్నారు.