-2021-22 సంవత్సరంలో రైతులు పండించిన ధాన్యం 70 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యం…
-ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులను ప్రజల ఇంటివద్దకే అందిస్తున్నాం…
-ప్రజలకు, రైతులకు మెరుగైన సేవలు అందించే సంస్థగా తీర్చిదిద్దుతా…
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ద్వారంపూడి భాస్కర రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరవస్తువులు ప్రజలకు అందించుటతోపాటు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించుటే లక్ష్యంగా పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీ ద్వారంపూడి భాస్కరరెడ్డి అన్నారు.
విజయవాడ కానూరులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో శుక్రవారం సంస్థ ఛైర్మన్ గా ద్వారంపూడి భాస్కర రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా నూతన ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన భాస్కర రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర హోం శాఖామంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు, విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్, దేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, గృహనిర్మాణశాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్, ప్రభుత్వ చీప్ శ్రీకాంత రెడ్డి, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్, ద్వారంపూడి చంద్రశేఖర్, సామినేని ఉదయభాను, తోట త్రిమూర్తులు, జ్యోతుల చంటిబాబు, రేపాక వరప్రసాద్, దాడి శెట్టి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్, అంబటి రాంబాబు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనరు కోన శశిధర్, యస్ సి కార్పోరేషన్ చైర్మన్ అమ్మాజీ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టరు యస్. ఢిల్లీ రావుతోపాటు అనేకమంది ప్రజాప్రతినిధులు, అధికారులు ద్వారంపూడి భాస్కర రెడ్డికి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ద్వారంపూడి భాస్కరరెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన రెడ్డి నాపై నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థకు ఛైర్మన్‌గా నియమించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి ఆశయసాధనలో నేనుకూడా భాగస్వామినై పౌర సరఫరాల సంస్థ ద్వారా మెరుగైన సేవలు ప్రజలకు, రైతులకు అందించే విధంగా పధకాలను అమలు చేస్తామని ఆయన అన్నారు. 2021-22 సంవత్సరంలో రైతుల వద్దనుండి 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రూ. 13720 కోట్ల రూపాయలు రైతులకు మద్ద తుధర అందించాలనే లక్ష్యంగా సంస్థ పనిచేస్తున్నదని ఆయన అన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఇప్పటివరకూ రైతుల వద్ద నుండి సేకరించిన 35.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను, రూ. 6650కోట్లు చెల్లించామని ఆయన అన్నారు. పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకునే విధంగా రాష్ట్రంలోని 268 మండల స్థాయి గోదాములను, 19 గిరిజన కోపరేటివ్ సొసైటీ గోదాములను సంస్థ నడుపుతున్నదని ఆయన అన్నారు. ప్రజలకు, రైతులకు పౌరసరఫరాల సంస్థ ద్వారా ప్రభుత్వ సేవలు విస్తృతస్థాయిలో అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఈదిశగా పౌరసరఫరాలసంస్థ పనిచేస్తున్నదన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, తెనాలి, అనంతపురం, ఉదయగిరి, చిత్తలూరు, నగరి, సత్యవేడు, యర్రగొండపాలెం మొదలగు 12 ప్రాంతాలలో పెట్రోలుబంకులను, సీతమ్మధార, ఉండి, కాకినాడ, సాంబమూర్తినగర్ (కాకినాడ), ప్రత్తిపాడు, గుంటూరు, కొత్తూరు, ఓ.డి.చెరువు, ధర్మవరం, శ్రీకాకుళం, కడప, పామూరు, మొదలగు 12 ప్రాంతాలలో యల్ పిజి గ్యాస్ ఏజెన్సీలను పౌర సరఫరాల సంస్థ నిర్వహిస్తున్నదని భాస్కర రెడ్డి అన్నారు. పౌరసరఫరాలసంస్థ ప్రజాపంపిణి విధానంలో నిరుపేదకుటుంబాలకు బియ్యం, కందిపప్పు, పంచదార పంపిణి చేస్తున్నదని, అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా బియ్యం, కందిపప్పు, పామాయిల్ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణి చేస్తున్నదని ఆయన అన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకం క్రింద అవసరమైన బియ్యాన్ని కూడా చౌకధరల దుకాణాల ద్వారా విద్యాశాఖకు సరఫరా చేస్తున్నదని ఆయన అన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం మిల్లింగ్ చేయగా వచ్చిన సార్టెక్స్ (Sortex) బియ్యం ప్రజాపంపిణీ విధానం ద్వారా ఇతర సంక్షేమ పథకాలకు పంపిణి చేయుట కొరకు వినియోగిస్తున్నామని భాస్కరరెడ్డి అన్నారు. కందిపప్పు, పంచదారలను ఆన్ లైన్ టెండర్ ద్వారా కొనుగోలుచేసి ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీధరలకు పంపిణి చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రతీనెలా వివిధ ప్రభుత్వ పధకాలకు 2 లక్షల 50 వేల టన్నుల బియ్యాన్ని పంపిణి చేస్తున్నామన్నారు. ప్రజాపంపిణి వ్యవస్థ ద్వారా కార్డుదారులందరికీ రూపాయికే కేజి బియ్యం చొప్పున అందిస్తున్నామని, అన్నపూర్ణ కార్డుదారులకు ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్నామని, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరాకొరకు స్త్రీశిశు సంక్షేమ శాఖకు కెజికి రూ. 4.35 పైసలు చొప్పున అందిస్తున్నామని, మధ్యాహ్న భోజన పధకానికి సంబంధించి విద్యాశాఖకు కేజి రూ. 3.70 పైసలు చొప్పున అందిస్తున్నామని, జైళ్లు, సిల్వర్ జూబ్లీ హాస్టల్స్ కు కేజి రూ. 37.50 పైసలు చొప్పున బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అందిస్తున్నదని భాస్కర రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రొత్తగా ప్రవేశ పెట్టిన ఇంటి వద్దకే ” నిత్యావసరవస్తువుల సరఫరా ” పధకం ద్వారా ప్రతికార్డుదారుని ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నామని, ఇందుకోసం 9260 మొబైల్ వాహనాలను వినియోగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగయువతకు ఉపాధి అవకాశాలు కల్పించుటలో భాగంగా వివిధ కార్పోరేషన్ల ద్వారా ఈవాహనాలను నిరుద్యోగయువతకు కేటాయించి వారికి ఉపాధి కల్పించామని భాస్కర రెడ్డి అన్నారు.