విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్నకాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసే ప్రక్రియకు జిల్లా కలెక్టరు జె.నివాస్ తీసుకున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. ఇందులో భాగంగా వియంసి పరిధిలోని ఇళ్ల లబ్దిదారుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈనేపథ్యంలో నగరంలోని భవననిర్మాణ కాంట్రాక్టర్లతో స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో వియంసి కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్ తో కలిసి జిల్లా కలెక్టరు జె. నివాస్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నగరంలో నివసిస్తున్న లబ్ధిదారులు వారికి కేటాయించిన ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రతీరోజూ పర్యవేక్షించుకో లేని ఇళ్ల లబ్ధిదారులను 20 నుంచి 25 మంది వరకూ ఒక గ్రూపుగా ఏర్పాటుచేసి సంబంధిత ఇళ్ల నిర్మాణాన్ని ట్రై
పార్టీ అగ్రిమెంట్ తో చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత కాంట్రాక్టర్లతో కలెక్టరు జె.నివాస్ చర్చలు జరిపారు. ఈసందర్భంగా పలువురు భవన నిర్మాణ కాంట్రాక్టర్లు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి తాము సుముఖంగానే ఉన్నామని అయితే అవసరమైన ఇసుక, సిమెంటు, ఇనుము సరఫరాలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరో ఒకటి, రెండు దఫాలు ఈ ఇళ్ల నిర్మాణం విషయం పై సమీక్షించి ఒక స్పష్టతకు రావాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో హౌసింగ్ జాయింట్ కలెక్టరు శ్రీనివాస నుపూర్ అజయ్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టరు జి.యస్.యస్. ప్రవీణ్ చంద్, వియంసి చీఫ్ ఇంజినీరు యం. ప్రభాకరరావు, నగరంలోని పలువురు భవననిర్మాణ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.