– కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా క్రొత్తగా అక్రిడిటేషన్ కార్డులు పొందిన వర్కింగ్ జర్నలిస్టులందరూ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రీమియం రూ. 1250/- cfms.ap వెబ్ సైట్ ద్వారా క్రింద తెలిపిన పద్దుకు చెల్లించి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ను 2021-22 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, 31 మార్చి, 2022 వరకు అమలులో ఉండే ఈ పధకానికి జర్నలిస్టు వాటాగా రూ. 1250/- చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ. 1250/- లను చెల్లిస్తుందని కమిషనర్ తెలిపారు. అక్రిడిటేషన్ల మంజూరుకు అడ్డంకులు తొలగిన నేపధ్యంలో జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జర్నలిస్టులు cfms.ap వెబ్ సైట్ నందు DDO Code : 8342 – 00 – 120 -01-03-001-001 VN, DDO Code : 2703 – 0802 – 003 నందు తమ వాటాను చెల్లించాలని ఆయన సూచించారు.
ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, అక్రిడిటేషన్ కార్డు జిరాక్సు కాపీ, రెన్యువల్ జర్నలిస్టులయితే హెల్త్ కార్డు జిరాక్స్ కాపీలను రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు విజయవాడలోని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనరేట్ కార్యాలయంలోనూ, జిల్లా స్థాయి జర్నలిస్టులైతే సంబంధిత జిల్లా కేంద్రంలో గల సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయవలసిందిగా ఆయన తెలిపారు.