Breaking News

కాపులకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పెద్ద పీట వేసింది వై.యస్. కుటుంబం మాత్రమే…


-సియం వైయస్. జగన్ రెండేళ్లలో కాపుల సంక్షేమానికి రూ. 12 వేల కోట్లు మంజూరు చేశారు.
-కీ.శే. వంగవీటి మోహనరంగా ఆశయాల స్పూర్తితో ముందుడుగు వేయండి..
-రాష్ట్ర మంత్రులు పేర్నినాని, కె.కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల్లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లక్షకోట్ల రూపాయలు లబ్దిదారుల ఖాతాలకు ప్రభుత్వం జమచేసిందని ఇది సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్ర రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపుకార్పోరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషగిరిరావును ప్రభుత్వం నియమించిన సందర్భంగా శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అడపా శేషగిరిరావు చేత ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారాన్ని మంత్రి పేర్ని నాని చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అధ్యక్షత వహించగా రాష్ట్రమంత్రులు కురసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు కరీమున్నీసా, తోట త్రిమూర్తులు, శాసనసభ్యులు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, అంబటి రాంబాబు, రోశయ్య, ఆమంచి కృష్ణమోహన్, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, గుంటూరు నగర మేయరు మనోహర్‌నాయుడు, డిప్యూటి మేయరు అవుతు శ్రీశైలజ, విజయవాడ నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, తదితరులు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాగా, వేలాదిమంది అభిమానుల సమక్షంలో అడపా శేషగిరిరావు కాపు కార్పోరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు.

రవాణా, సమాచార శాఖామంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పేదరికం ఎక్కువుగా ఉండే కాపువర్గాల్లో ప్రతీ ఒక్కరూ వారి పిల్లలను చదివించాలని అప్పుడే ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదల సాధించగలమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి కాపుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి అనేక పధకాలను అమలు చేస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి వైపు పయనించేలా కాపు కార్పోరేషన్ వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. ముఖ్యంగా విద్యార్ధుల ఉన్నత చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టి కాపు విద్యార్ధులను ఉన్నత చదువులవైపు ప్రోత్సహించాలని ఆదిశగా చర్యలు తీసుకోవాలని నూతన ఛైర్మన్ అడపా శేషుకు మంత్రి సూచించారు. వంగవీటి మోహనరంగా ఒక కులానికి చెందిన నాయకుడు కాదని ఎక్కడైతే పేదలు ఉన్నారో వారికి అండగా నిలబడి వారి శ్రేయస్సుకొరకు పాటుపడిన నాయకుడు అని మంత్రి అన్నారు. అటువంటి నాయకులను స్పూర్తిగా తీసుకుని కష్టాల్లో, పేదరికంలో ఉన్నవారికి చేయి అందించి వారి అభ్యున్నతికి పాటుపడాలన్నారు. మనందరిలోనూ పిల్లలను చదివించుకోవాలనే చైతన్యం పెరగాలని, చదువు ఒక్కటే మనిషి ఎదుగుదలకు ఆధారమని పేర్ని నాని అన్నారు. కాపుల్లో లౌఖ్యం లేక పౌరుషంగా ఉండడం వలన వ్యాపార ఇతర రంగాలలో రాణించలేక పోతున్నారని అన్నారు. ఇందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని తీసుకుని ఇతరులతో సమానంగా అన్నిరంగాల్లోనూ రాణించాలని మంత్రి అన్నారు. ఆర్ధికంగా ఉన్న కుటుంబాలు కష్టాల్లో ఉన్న పేదకుటుంబాలకు చేయి అందించాలన్నారు. రాజకీయ సమతౌల్యత పాటిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కాపులకు పెద్ద పీట వేశారని, ఏకులమైనా వారి శ్రేయస్సుకొరకు పనిచేయాలని ఆవిధంగా ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అడపా శేషగిరిరావు కాపుల సంక్షేమానికి వారి అభివృద్ధికి పాటుపడగల నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అని మంత్రి పేర్ని నాని అభినందించారు.

రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కాపులను ఓటుబ్యాంకుగా వాడుకుని వదిలేశాయని, జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. పేదరికంగా నలిగిపోతున్న కాపులకు ఇడబ్ల్యుయస్ రిజర్వేషన్ ప్రభుత్వం కల్పిం చిందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం కాపుసామాజిక వర్గాన్ని శాంతిభద్రతలకు విఘాతం కల్పించే జాతిగా ఛిత్రించారని, మహిళలపై కూడా కేసులు పెట్టారని అందుకే గత ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా ఓటమి చవిచూసిందని మంత్రి అన్నారు. చేతల ముఖ్యమంత్రిగా జగన్మోహన రెడ్డి కాపుల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి అనేక పధకాలను అమలు చేస్తున్నారని వీటిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అన్నారు. సమాజం బాగుండాలి, అందులో నేను (కాపులు) ఉండాలి అనే భావనతో ఐక్యమత్యంతో ప్రతీ ఒక్కరూ ముందుకు సాగాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమని వ్యవసాయ శాఖామంత్రి కన్నబాబు అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) మాట్లాడుతూ అట్టడుగున ఉన్న కాపు సోదరులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సముచిత స్థానాన్ని కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డికి చెందుతుందన్నారు. వంగవీటి మోహనరంగా లాంటి నాయకులు కష్టాల్లో ఉన్నవారికి చేయూతనిచ్చి అందరివాడిగా పేరుతెచ్చుకున్నారని అటువంటి నాయకుల ఆశయాలను స్పూర్తిగా తీసుకుని కాపుసోదరులందరూ తోటి వ్యక్తులను ఆదుకుంటూ సమాజంలో అభివృద్ధిని సాధించాలని అన్నారు. గత ప్రభుత్వం ఓట్లకోసం కాపుసామాజికవర్గంలో ఆశలు కల్పించి మోసం చేసిందన్నారు. కాపుల సంక్షేమం కోసం రూ.1800 కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేస్తే మన ప్రభుత్వం రెండేళ్లలో రూ. 12 వేల కోట్లు ఖర్చు చేసి కాపులకు అన్ని విధాల ఆర్ధిక పరిపుష్టిని కల్పించిందని మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు.

రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి చెందుతుందని, కరోనా సమయంలో కూడా ప్రజలకు అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం సహకారాన్ని అందించిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాపుకార్పోరేషన్ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పధకాలను ఉపయోగించుకుని కాపు సామాజికవర్గం ఆర్ధికంగా సామాజికంగా బలోపేతం కావాలని ఇందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నదని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

కాపుకార్పోరేషన్ ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన అడపా శేషగిరిరావు మాట్లాడుతూ కాపుల సంక్షేమానికి ఆర్ధిక పురోగతికి కార్పోరేషన్ ఛైర్మన్ గా తనవంతు కృషి చేసి ముఖ్యమంత్రి తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. కాపు కార్పోరేషన్ ద్వారా విద్యార్ధుల విద్యాభివృద్ధికి తోడ్పాటును అందిస్తానన్నారు. కాపు సామాజిక వర్గానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఎల్లప్పుడూ తగిన సముచిత స్థానాన్ని కల్పిస్తారనే దానికి తానే ఉదాహరణ అన్నారు. కాపు సామాజిక వర్గ అభివృద్ధికి రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల సహాయ సహకారాలతో కృషి చేస్తానన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎ మ్మెల్సీలు కరీమున్నీసా, తోట త్రిమూర్తులు, శాసనసభ్యులు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, అంబటి రాంబాబు, రక్షణనిధి, రోశయ్య, ఆమంచి కృష్ణమోహన్, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, గుంటూరు నగర మేయరు మనోహర్‌నాయుడు, డిప్యూటి మేయరు అవుతు శ్రీశైలజ, ఏపి హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దొరబాబు, విజయవాడ నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయరు బెల్లం దుర్గ, ఆంధ్రప్రదేశ్ కాపుకార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టరు శ్రీనివాస శ్రీన రేష్, గుంటూరు జిల్లా డిసిసి ఛైర్మన్ రాము, తదితరులు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *